మలయాళం సినిమాలకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్లుంది. మలయాళ పరిశ్రమలో పరిమిత బడ్జెట్ తో సినిమాలను రూపొందుతాయన్న విషయం తెలిసిందే. కానీ మంచి కథను సరైన కథనంతో తీసి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటుంది మలయాళ పరిశ్రమ. ఇప్పటికే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ భారీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది.
బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందించిన ది గోట్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోవిడుదలైంది. ఇదొక సర్వైవల్ డ్రామా కావడం గమనార్హం. ఇదే ఏడాది సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన మంజుమ్మల్ బాయ్స్ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి ది గోట్ డేస్ వడివడిగా పరుగులు తీస్తుంది.
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను కేరళలో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కాగా ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆడు జీవితం పేరుతో రిలీజ్ చేసినా కలెక్షన్స్ కొల్లగొట్టడంలో విఫలమైంది. కానీ విమర్శకుల ప్రశంసలను పొందింది. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నజీబ్ పాత్ర కోసం తనను తాను మలచుకున్న తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.