ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణకోసం వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుతుండడం, హత్యలు, హింసాత్మక సంఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో(2022) స్పష్టం చేసింది.
గణనీయంగా తగ్గిన కేసుల సంఖ్య
ఏపీలో గతంతో పోలిస్తే కేసుల సంఖ్యా కూడా గణనీయంగా తగ్గింది. వివిధ నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేదుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసులు 1,88,997 నమోదు కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 కేసులు మాత్రమే నమోదయ్యాయి. స్పెషల్ లోకల్ లా కేసులను పరిశీలిస్తే 2020లో 49,108 నమోదు కాగా, 2021లో 42,588, 2022లో 36,737 నమోదయ్యాయి .మొత్తం కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2020లో 2,38,105 కేసులు ఉంటే, 2021లో 2,22199 కాగా, 2023లో 1,95,284 కేసులున్నాయి.
వేగంగా ఛార్జ్షీట్లు
రాష్ట్రంలో నేరాలకు పాల్పడేవారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా కృషిచేస్తోంది. పోలీసు శాఖ వేగంగా ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. 2022లో ఐపీసీ కేసుల్లో 86.5 శాతం కేసుల్లో, లోకల్ లా కేసుల్లో 96.4శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధి 60రోజుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. మొత్తం మీద 88.9శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధిలో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం పోలీస్ శాఖ వేగవంతమైన పనితీరుకు నిదర్శనం.
రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా, 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. హత్యల రేటు ఉత్తరాధి రాష్ట్రాల్లో 3 శాతానికిపైగా ఉండగా, తెలంగాణలో హత్యల రేటు 2.5 శాతం ఉంది. ఏపీలో మాత్రం 1.7శాతానికే పరిమితమైంది. హత్య కేసుల్లో దేశం టాప్-20 రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ లేకపోవడం జగన్ ప్రభుత్వ సమర్ధవంతమైన పనితీరుకు ఉదాహరణగా చెప్పొచ్చు. .
ఘర్షణలు, అల్లర్ల కేసులు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 444 ఘర్షణలు, అల్లర్ల కేసులు నమోదు కాగా 2022 లో ఆ కేసులు 304కు తగ్గిందని ఎన్సీఆర్బీ గణాంకాలు చెప్తున్నాయి.
మహిళలకు అండగా దిశ యాప్
దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలినిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో 621 కేసులకు తగ్గాయి. అత్యాచారాల కేసులు దేశంలోనే అత్యధికంగా 47.72 శాతం తగ్గడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో ఆ కేసులు 100కు తగ్గాయి. వరకట్న కేసుల రేటు కేవలం 0.4శాతానికే పరిమితమైంది. ఇక యాసిడ్ దాడుల కేసులు 2021లో ఏడు నమోదు కాగా 2022కు అవి 4 కేసులకు తగ్గాయి.
తగ్గిన రైతు ఆత్మహత్యలు
రైతు సాధికారికత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విజయవంతమవుతున్నాయి. సాగు లాభసాటిగా మారడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359మంది ఉండగా కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309మంది ఉండగా కౌలు రైతులు 60 మంది ఉన్నారు.
2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడే వారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో అవి 917కు తగ్గాయి.
మొత్తంగా చూస్తే శాంతిభద్రతలను పరిరక్షిస్తూ నేరాల సంఖ్యను అదుపు చేయడంలో జగన్ ప్రభుత్వం సమర్ధవంతమైన పాత్ర పోషిస్తుందని ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిశా యాప్ దిశా పోలీస్ స్టేషన్ల నిర్వహణతో మహిళలకు భద్రత కల్పిస్తూనే సమర్ధవంతమైన పోలీసింగ్ వ్యవస్థతో నేరాల సంఖ్య తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పొచ్చు.