జర్నలిజాన్ని నడిపించేది కలం అయితే, ఆ కలాన్ని నడిపించేది సిరా. చరిత్రలో ఎంతో మంది పాత్రికేయులు, విలేఖరులు, పత్రికాధిపతులు తమ తమ జర్నలిజం విలువలతో తెలుగు పాత్రికేయ రంగంలో తమ సంతకాలనూ, పాఠకుల మనసులో మీద తమ సిరా చుక్కలతోనూ చెరగని ముద్ర వేసారు. కానీ, కాలం గడిచేకొద్దీ ఒక పత్రిక మాత్రం తన జర్నలిజం పెన్నులో ఇంకు బదులు విషం నింపుకుని, కాలనాగులా తన అక్కసును కక్కుతుంది.
అంటరానితనాన్ని అనుభవించి, ఉద్యమించి, శ్రమించి, అధిగమించి భవిష్యత్తు తరాలకు అసలు ఆ అంటరానితనం అనేది ఒకటుండేదని తెలియకూడదనే జీవితాశయంతో పనిచేసి మహనీయుడైన విగ్రహావిష్కరణకి, ఈరోజు ఆ పత్రిక మళ్ళీ అంటరానితనాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
“అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ తాకకూడదంటూ, నొక్కి ఎక్కడ నాగలోకం ఎక్కడ” అంటూ మళ్ళీ సారూప్యతల పేరున, అసలు అంబేద్కర్ మహాశయుడు దేనికోసమై పోరాడాడో, ఆయనకి ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా అంటరానితనాన్ని అంటగట్టింది. అసలు ఒక విగ్రహావిష్కరణ విషయంలో, ముఖ్యమంత్రి ఎందుకు ఆ ఆవిష్కరణ తన చేతులతో చేయకూడదో అంటూ పదేసి కారణాలు రాసి, ప్రతి కారణంలోనూ గత అయిదేళ్ళుగా తమ అస్మదీయులు ప్రతిపక్ష పాత్ర పోషించడం పట్ల కలిగిన అసహనాన్ని “తాకరాదు” అంటూ వెళ్ళిగక్కింది.
ఇన్నాళ్ళూ రాజకీయపార్టీలు అంబేద్కర్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చూసాం కానీ మొదటి సారి ఇలా తన ఆగ్రహాన్ని, అక్కసునూ, అసహనాన్ని, ఓర్వలేనితనాన్ని ప్రదర్శించేందుకు ఓ పత్రిక వాడటం మాత్రం ఇదే ప్రథమం!!