రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనకు రాజకీయ రంగు పులిమి తమకు అనుకూలంగా మార్చుకోవడం ఎల్లో గ్యాంగ్‌కు బాగా అలవాటు. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా.. ఇద్దరు కొట్టుకున్నా.. కుటుంబాల్లో గొడవలు జరిగినా.. అది జగన్ వల్లే అని తప్పుడు ప్రచారం చేయడమే వారి పని. మాచర్ల నియోజకవర్గంలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోతే పచ్చ మనుషులు శవ రాజకీయాలకు తెరలేపారు. వీరికి ఎల్లో మీడియా సహకారం ఉండనే ఉంది. టీడీపీ మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. నేర పూరిత రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక ప్రతి విషయాన్ని ఆయనకు లింకు పెట్టి లబ్ధి పొందాలని చూస్తుంటారు. ఈ క్రమంలో మహిళ చావును వీరంతా రాజకీయం చేస్తున్నారు.
ఇదీ నిజం
ట్రాక్టర్ నీళ్ల ట్యాంకర్ పొలం నుంచి గ్రామంలోకి వస్తుండగా బాణావత్ సామునిబాయిని అనే గిరిజన మహిళను ఢీకొంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మృతిచెందింది. పోలీసుల విచారణలో వచ్చీరాని డ్రైవింగ్ కారణంగా తన పెద్దమ్మకు ప్రమాదం జరిగిందని మృతురాలికి కొడుకు వరుసయ్యే బాణావత్ కృష్ణనాయక్ స్పష్టంగా తెలిపారు.
మహిళ మృతిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జూలకంటి అసత్య ప్రచారానికి దిగారు. జరిగింది ఒకటైతే మరో విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సాముని బాయి నీళ్లు పట్టుకుంటానని అడిగితే రామకృష్ణారెడ్డి అనుచరులు మా పార్టీ కాదంటూ ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేశారని ఆరోపించారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో రామకృష్ణారెడ్డి ఉన్నారని మీడియా ముందు వెల్లడించారు.
ప్రతి విషయాన్ని జగన్‌కు అంటగట్టాలని చూసే ఎల్లో గ్యాంగ్ వెంటనే రంగంలోకి దిగింది. పక్కా ప్లానింగ్‌తో ఈ అంశాన్ని రాజకీయం చేయడం ప్రారంభించారు. లోకేశ్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు.. నీరు అడిగితే ప్రాణాలు తీస్తారా అంటూ తమ రంగును బయటపెట్టారు. పవన్ అయితే టీడీపీ స్క్రిప్ట్‌ను పోస్టు చేశారు. తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా, పంచభూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని ప్రెస్‌నోట్‌లో జగన్‌పై విషం కక్కారు. సదరు మహిళ ప్రమాదంలో చనిపోయిందని సాక్షాత్తు కుటుంబసభ్యులే చెబుతున్నా వీరంతా అసత్య ప్రచారాలకు దిగారు.
ఇక యాక్సిడెంట్ విషయంలో జూలకంటి చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను నియోజకవర్గ ప్రజానీకం ఛీ కొడుతోంది. అసలు మంచినీళ్లు అడిగితే ఎవరైనా ట్రాక్టర్‌తో గుద్ది చంపుతారా అని ప్రశ్నిస్తోంది. కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలి. ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకే కదా ట్యాంకర్‌ను పంపింది. మరి దానితో ఆమెను చంపాల్సిన అవసరం ఏముంది?. ఈయనకు ఎల్లో గ్యాంగ్ వత్తాసు పలికి అభాసుపాలైంది.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా పిన్నెల్లి నీళ్లు ఇవ్వలేదని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. 2009 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. అప్పటి ప్రభుత్వాల దృష్టికి ఎన్నోసార్లు నీటి సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న వ్యక్తి రామకృష్ణారెడ్డి. రెండేళ్లు కరోనా కారణంగా ఇబ్బందులు తలెత్తినా వరికపుడిశెల ఎత్తిపోతల పథకం కోసం కేంద్రం చుట్టూ తిరిగి అటవీ, పర్యావరణశాఖలతోపాటు ఇతర అనుమతులు సాధించింది పిన్నెల్లి అని అందరికీ తెలుసు. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం కింద రూ.340.26 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత శంకుస్థాపన చేయించారు. ఇంకా జల్‌జీవన్ మిషన్ కింద నియోజకవర్గం మొత్తానికి ప్రతి ఇంటికీ టాప్ కనెక్షన్ ఇప్పించేందుకు పైప్‌లైను వేయించి పనులు చేయిస్తోంది జూలకంటి కాదు.. రామకృష్ణారెడ్డే కదా.. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నారు.
అసలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పెట్టారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. వరికపుడిశెలపుడి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది మీ నాయకుడే కదా జూలకంటి. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చూస్తోంది నువ్వేనని ప్రజలందరికీ తెలుసు. నిత్యం అలజడులు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి చూస్తున్నావు. రామకృష్ణారెడ్డిని ఢీకొట్టాలంటే నీ స్థాయి సరిపోదనే కదా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నావు..