వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల రూపురేఖలు పూర్తగా మార్చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఏ విధంగా అయితే మెనూలో మార్పులు తెచ్చారో హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. గురుకులాలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల నేడు పిల్లలకు మంచి భోజనం అందుతోంది. తెలుగుదేశం హయాంలో.. ప్రభుత్వ హాస్టళ్లు అంటేనే.. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు ఉండేవి. దీంతో పిల్లలు తినలేకపోయేవారు. మరి నేడు.. రైస్, రవ్వ ఉప్మా, పొంగల్, చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీతో కమ్మనైన ఆహారం వడ్డిస్తున్నారు.
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం మెనూ విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం జగన్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఎలా ఉండాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం పాలు, చిక్కీలు, సాయంత్రం సేమియా పాయసం, ఉడికించిన పల్లీలు, రాగి లడ్డూ, మరమరాలు, రవ్వ కేసరిని అందిస్తోంది. ఇంకా అరటి పండు, గుడ్లు అందుతున్నాయి. ఇందుకు అనుగుణంగా డైట్ చార్జీలను కూడా పెంచింది. కాస్మోటిక్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి.
మెనూ ఇలా..
విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 8వ తేదీన మెస్ చార్జీలను పెంచుతూ జీవో నంబర్ 8ని జారీ చేసింది. కొత్త మెనూలో ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు రకర కాలైన వంటకాలుంటాయి. ఉదయం 7 గంటలకు పాలు, టిఫిన్‌లో పూరి, పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగలి తదితర వాటిల్లో ఏదైనా వడ్డిస్తారు. రాత్రి రోజూ ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు, అన్నం, ఆకుకూర పప్పు, సాంబారు, పల్లీల చట్నీ, సాయంత్రం స్నాక్స్‌గా వేరుశనగ చిక్కీలున్నాయి. ఇవన్నీ కాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం విధిగా చికెన్ బిర్యానీ పెడుతున్నారు. గతంలో వారంలో రెండు పర్యాయాలు మాత్రమే చికెన్ పెట్టే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం వారంలో మూడు సార్లు (ఆది, మంగళ, శుక్రవారాల్లో) వడ్డిస్తున్నారు. పైగా రోజూ పిల్లలకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఫొటోలు తీసి జిల్లాలోని సంక్షేమ శాఖలకు చెందిన అధికారులతో పాటు రాష్ట స్థాయిలోని అధికారులకు అప్లోడ్ చేయాలి. దీని వల్ల ఎక్కడైనా లోపాలుంటే వెంటనే సవరించునే వీలుంది.
డైట్ చార్జీలకు 3 నుంచి 4వ తరగతి వరకు టీడీపీ హయాంలో రూ.1,000 ఉండగా నేడు రూ.1,150కి చేరింది. 5 నుంచి పది వరకు రూ.1,250 ఉండగా నేడు రూ.1,400 అయ్యింది. ఇంటర్, ఆపై.. రూ.1,400 ఉండగా రూ.1,600 అయ్యింది. కాస్మోటిక్ చార్జీల విషయానికొస్తే 3 నుంచి 6వ తరగతి (బాలురు)కి టీడీపీ హయాంలో రూ.100 ఉండగా జగన్ ప్రభుత్వం దానిని రూ.125 చేసింది. బాలికలకు అప్పుడు రూ.110 ఇవ్వగా నేడు రూ.130 ఇస్తున్నారు. 7 నుంచి పది వరకు బాలురకు రూ.125 నాడు ఇవ్వగా.. నేడు రూ.150 అయ్యింది. అదే బాలికల విషయానికొస్తే రూ.160 నుంచి రూ.200కు పెరిగింది. ఇంటర్.. ఆపై బాలురకు రూ.155 నుంచి రూ.200కు పెరిగింది. బాలికల విషయానికొస్తే రూ.160 నుంచి రూ.250కి చేరింది.
ఓ వైపు పౌష్టికాహారాన్ని అందిస్తునే మరో వైపు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సచివాయాల్లోని ఏఎన్ఎంలు ప్రతి వారం హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నారు. అలాగే ప్రతి నెలా సమీపంలోని పీహెచ్సీ వైద్య సిబ్బంది వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పిల్లలకు జబ్బు చేస్తే తల్లిదండ్రులకు చెప్పేవారు. నేడు ముందు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు.