2024 నూతన సంవత్సర వేడుకల్లో తెలుగు దేశం పార్టీ వర్గీయులు ఒకరిపై బాహాబాహీకి దిగడం సంచలనం కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద తెలుగుదేశం పార్టీ సాయి వేదికలో ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య పాల్గొన్నారు. యనమల దివ్య వేదికనుండి వెళ్ళిపోయిన తరువాత యనమల రామకృష్ణుడి సోదరుడి కుమారుడైన యనమల రాజేష్ తన అనుచరులతో రావడం జరిగింది.
ఇదే సమయంలో వేదికపై ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్యూ కట్టారు. యనమల రాజేష్ యనమల రామకృష్ణుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూలైన్ తప్పడంతో యనమల కృష్ణుడి వర్గీయులు రాజేష్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రాజేష్ వర్గీయులు వేదికపైకి వెళ్లేందుకు విఫలయత్నం చేసారు. తద్వారా యనమల రాజేష్, కృష్ణుడి వర్గం మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆగ్రహానికి గురైన ఇరువర్గాల బాహాబాహీకి దిగి పిడిగుద్దులు గుద్దుకోవడంతో వేదికపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు అదుపుతప్పి విషమించేలా ఉండడంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు.