స్పష్టమైన ఆలోచన, స్థిరమైన కార్యాచరణ, నిబద్దతతో కూడిన నిర్ణయాలు లేకుండా తొందరపాటు చర్యలతో రాజకీయ నాయకులు ఎలా విఫలమవుతారో అనటానికి ఒక ఉదాహరణ వై ఎస్ షర్మిల . వైఎస్సార్ అకాలమరణం తర్వాత ఓదార్పు యాత్ర పై కాంగ్రెస్ అధిష్టానంతో విభేడించి బయటకి వచ్చిన జగన్ సొంత పార్టీ పెట్టిన నాడు జగన్ తో ఉన్నారు షర్మిల . కాంగ్రెస్ ని వీడిన ఫలితంగా పలు అక్రమ కేసుల్లో ఇరుక్కుని జగన్ జైలు పాలయ్యిన సందర్భంలో జగన్ ప్రతినిధిగా జగనన్న వదిలిన బాణాన్ని అని తన ఉనికి ప్రకటించుకొని దేశ చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర చేపట్టిన షర్మిలకి యావత్ రాష్ట్ర ప్రజానీకం నీరాజనాలు పలికారు.ఆ జన ప్రభంజనం వెనకున్న అదృశ్య హస్తం గురించి సమగ్రంగా అర్ధం చేసుకొని ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరి ఆంధ్రా రాజకీయాల్లో అడుగు పెట్టి ఉండేవారు కాదేమో .
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నియంత్రత్వ పోకడని నిరసించి ప్రపంచంలోనే శక్తివంతమైన పది మంది మహిళల్లో ఒకరుగా నాడు కీర్తించబడుతున్న సోనియాని దిక్కరించి పార్టీ పెట్టిన జగన్ తెగువకు, ధైర్యానికి అచ్చెరువొందిన రాష్ట్ర ప్రజానీకం రాజశేఖర్ రెడ్డికి తగ్గ వారసుడిగా జగన్ కి వచ్చిన ప్రజాదరణ చూసి అసూయ పడిన ఢిల్లీ పెద్దలు అక్రమ కేసులతో జగన్ ని జైలు పాలు చేసిన క్రమంలో తలొంచని మొండి పట్టుదల చూసిన ప్రజానీకం, అదే మొండి తనంతో జగన్ వెన్నంటి నిలిచారు.
ఆ జన బలమే నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ వచ్చిన షర్మిలని అక్కున చేర్చుకొనేలా చేసింది. అలా ఏపీ రాష్ట్రంలో షర్మిల ప్రస్థానం వైఎస్ తనయురాలిగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెల్లెలుగా, వైఎస్సార్సీపీ ప్రతినిధిగా సాగిందే కానీ షర్మిల సొంత రాజకీయ చరిష్మాతో సాగలేదన్నది నిష్టుర సత్యం .
2014 ఎన్నికల తర్వాత కొంత స్థబ్దుగా ఉన్న షర్మిల 19 ఎన్నికల తర్వాత జగన్ కు దూరమయ్యారని చెప్పొచ్చు . ఇందుకు సంభందించిన కుటుంబ అంతర్గత కారణాలు ఎవరికి తెలియకపోయినా షర్మిల ఏపీ రాజకీయాల్లో కాకుండా తెలంగాణాలో రాజకీయ ప్రవేశం చేయడంతో అక్కడున్నా మా రాజన్న బిడ్డ అంటూ ఆదరణ చూపించారు ఇరు రాష్ట్రాల వైఎస్ అభిమానులు . వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ కు దూరమైన పలువురు వై ఎస్ అనుచరులు ఇతర పార్టీల్లో కుదురుకొని ఉండటంతో వెంటనే బయటకి వచ్చి షర్మిలను సపోర్ట్ చేయలేకపోయినా షర్మిల ప్రస్థానాన్ని ఆసక్తికరంగా గమనించారు.
కానీ షర్మిల రాజకీయ పయనం లక్ష్యం లేని, గమ్యం తెలియని గజిబిజి యాత్రలా మారడంతో భవిష్యత్తులో షర్మిల వెంట పయనిద్దాం అనుకొన్న వారు స్థబ్డుగా మిగిలిపోయారు. అవగాహన లేని డైలాగులతో టిఆర్ఎస్ సహా అన్ని పార్టీల వారిని విమర్శిస్తూ నవ్వుల పాలయ్యిన షర్మిల ఎన్నికల యుద్ధం సమీపించే నాటికి తాను పన్నెండేళ్ల పాటు తిట్టిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ బరి నుండి తప్పుకొనే సరికి ఇన్నాళ్ళూ తనను అనుసరించిన కొద్ది మంది నాయకులు రాజకీయ నడి సందరంలో మునిగిపోయారు .
అంతేకాదు ఇన్నాళ్ళూ తన తండ్రీ పేరుని ఎఫ్ఐఆర్ లో అన్యాయంగా చేర్చారని, రేవంత్ వంటి దొంగని ప్రోత్సహించారని విమర్శించిన కాంగ్రెస్ కి మద్దతు పలకడంతో పూర్తిగా విలువ కోల్పోయారని చెప్పొచ్చు .
ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరడం, తనయుడి పెళ్లి పిలుపుల పేరిట వైఎస్ కుటుంబానికి ఆజన్మ శత్రువు, కాంగ్రెస్ అజ్ఞాత మిత్రుడు చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలని, జగన్ రాజకీయ వ్యతిరేకుల్ని కలవడం గమనించిన రాజకీయ విశ్లేషకులు షర్మిల త్వరలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గా ఏపీ రాజకీయాల్లో కాలు మోపుతుంది అని ఒక అంచనాకి వచ్చారు. అందరూ అనుకొన్నట్టే కుటుంబాల్ని చీల్చి రాజకీయాలు చేసే సోనియా షర్మిలని ఏపీ పిసిసి ప్రెసిడెంట్ చేసింది.
తాను తెలంగాణా కోడలనని ఆడ బిడ్డనే కానీ ఈడ బిడ్డని కానని తెలంగాణా బిడ్డగా క్లెయిమ్ చేసుకొన్న షర్మిల పలు ప్రసంగాలలో తన రాజకియ భవిష్యత్తు తెలంగాణాలోనే అని స్పష్టం చేయడంతో పాటు తెలంగాణా ఏపీ జలవివాదాల్లో తెలంగాణా తరుపున వకాల్తా పుచ్చుకొని ఆంధ్రాకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారు అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించటం ఆంధ్రా ప్రజలు మర్చిపోలేదు. అలాగే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీ ప్రాంతానికి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మరో వందేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోదు.
ఏపీకి, తన కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం, తన అన్నని అక్రమ కేసుల్లో ఇరికించి జైలులో పెట్టి, తనని, తన తల్లిని రోడ్డున పడేసిన దయనీయ క్షణాలు షర్మిల మర్చిపోవచ్చు. కానీ వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు ఎప్పటికి మర్చిపోరు.
కాంగ్రెస్ కి ఉన్న ఇన్ని ప్రతికూలతలు దాటుకొని, రాష్ట్రానికి, తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీలో చేరి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో చేరిన షర్మిలని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా, వైఎస్ కుటుంబ అభిమానుల్ని ఆకర్శించగలుగుతుందా, వైసీపీలో చీలికలు తెచ్చి జగన్ ని నాశనం చేయాలన్న సోనియా కల నెరవేరుస్తుందా అంటే అసాధ్యమనే చెప్పొచ్చు .