అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎందుకింత పక్షపాతంగా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం (ఈసీ) ఇలా ప్రవర్తించడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అని పిలవబడే ఈసీ ఎప్పుడు లేని విధంగా దేశం లో ఒకలా.. ఏపీలో ఇంకొకలా… ఎందుకిలా ఈసీ? అని ప్రశ్నించేలా అడుగులు వేస్తుంది. అయితే గతంలోనే పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిర్దిష్టమైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇవే మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించిన మార్గదర్శకాలు పై కాకుండా ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని సడలింపులు జారీ చేసింది. ఈ నెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి చేసిన విజ్ఞప్తి మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే దేశమంతా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్దిష్టమైన మార్గదర్శకాల మధ్య పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ రకమైన సడలింపులు ఎందుకు అని సామాన్య ప్రజలకి సైతం ఈసీ తీరు పై సందేహాలు కలిగించేలా ఉంది. ఈ విధమైన సడలింపులు ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు గనక జరిగితే కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్నాయి రాజకీయ పక్షాలు. మరొకపక్క శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళన చెందుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇంత ‘పచ్చ’పాతం అంటూ ఈసీ తీరుపై విమర్శలు వస్తున్నాయి.