2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ అంటూ కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చివర్లో బీజేపీకి ఎదురు తిరిగి పెద్ద డ్రామానే నడిపారు. అందులో భాగంగానే హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో భూస్థాపితం కానున్న టీడీపీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసం ఛీ కొట్టిన బీజేపీ దగ్గరకు పవన్ తో రాయబారం నడిపి కాళ్ళ బేరానికి వెళ్ళాడు.
కాగా మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని బీజేపీ, జనసేనలకు కలిపి టీడీపీ 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను కేటాయించిందని వార్తలు వస్తున్నాయి. కేవలం ఐదు ఎంపీ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పొత్తుకు ఒప్పుకోవడం ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన చంద్రబాబును అక్కున చేర్చుకోవడం వెనుక బీజేపీ స్టాండ్ ఏంటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. వాస్తవానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి అసలు ఇష్టం లేదని కాళ్ళా వేళ్ళా పట్టుకుని బ్రతిమిలాడానని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
పొత్తు ఇష్టం లేనప్పుడు అతి తక్కువ సీట్లకు టీడీపీకి లొంగిపోవడం వెనుక బీజేపీ ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సప్త సముద్రాలు ఈది ఇంటి పిల్ల కాలువలో పడి చచ్చినట్లు, ఇంతకాలం పొత్తుల విషయంలో కాలయాపన చేసి కేవలం ఐదు ఎంపీ, ఆరు అసెంబ్లీ సీట్లకు టీడీపీతో జట్టు కట్టడం చూస్తుంటే చంద్రబాబులో వశీకరణ విద్యలేమైనా ఉన్నాయా అని రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. కాగా ఏపీలో వైసీపీకి అనుకూలంగా సర్వేలన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేనతో జట్టు కట్టడం ఆసక్తికరంగా మారింది. మరి బీజేపీతో పొత్తు టీడీపీకి ఊపిరి నిస్తుందా లేక పూర్తిగా భూస్థాపితం చేస్తుందా అనేది ఎన్నికల తర్వాతే బయటపడుతుంది.