2017 లో కేంద్రం తీసుకొచ్చిన ఫైనాన్స్ ఆక్ట్ 2016 అండ్ 17 చట్టాన్ని రాజ్యంగా విరుద్ధం అనీ, ఆ చట్టం అమలు కోసం చేసిన ఇతర నాలుగు చట్టాలలోని సవరణలు కూడా చెల్లుబాటు కావని సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ చట్టం రద్దు అని వ్యావహారికంగా పిలుస్తున్నారు..
ఈ చట్టం రాకముందు రాజకీయ పార్టీలకు ఎవరైనా వ్యక్తులు గానీ, సంస్థలు కానీ విరాళాలు ఇస్తే 20,000 రూపాయలు దాటిన వాటి వివరాలను ఆయా రాజకీయ పార్టీలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది.అలాగే ఆ సంస్థ యొక్క వార్షిక లాభంలో 7-5% లేదా వార్షిక టర్నోవర్ లో 10% లోపే విరాళం గా ఇవ్వాల్సి ఉండేది. అయితే 2016 లో ఎన్డీయే ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో సరికొత్త విరాళాల పద్దతికి శ్రీకారం చుట్టుంది. దీని ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదలచిన వారు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆ విరాళాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎలా అంటే, ఎస్బీఐ రూ 1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్ లలో బాండ్ లు అమ్ముతుంది వాటిని కొని పొలిటికల్ పార్టీ లకు విరాళం గా ఇవ్వొచ్చు. ఇవి వడ్డీ లేని బాండ్ లు. ఈ బాండ్ లు స్వీకరించిన పార్టీ లు వాటిని నిర్ణీత కాలం లోగా ఖర్చు చేసుకోవాలి, లేనిపక్షం లో ఆ సొమ్ము మొత్తం ప్రధాన మంత్రి సహాయ నిధికి చెందుతుంది. అలాగే ఈ బాండ్ లను ఏడాదిపొడువునా ఇప్పుడంటే అప్పుడు అమ్మరు, కేవలం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ఏదో సమయంలో కేవలం పది రోజులే అమ్ముతుంది ఎస్బీఐ. ఎలక్షన్ ఇయర్ లో మాత్రం ఈ గడువు 30 రోజులు ఉంటుంది.. ఆ సమయం లోనే వాటిని కొనాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో గానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గాని పోటీ చేసి కనీసం 1% ఓట్లు పొందిన ఏ పొలిటికల్ పార్టీ అయినా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పొందడానికి అర్హులు.. విరాళాలు ఇచ్చిన వారు ఆ విరాళాలకు సంబందించిన సొమ్మును ఆదాయపు పన్ను లో చూపించి పన్ను మినహాయింపుకు అర్హులు అవుతారు.. ఈ అంశం ముందు నుండీ ఉన్నా మరోసారి ఈ చట్టంలో స్పష్టం చేసారు..
ఇంతకు ముందు 20,000 రూపాయలు దాటిన విరాళాలను ఆయా పొలిటికల్ పార్టీ లు బహిర్గతం చేయాల్సి ఉండగా, ఈ చట్టం ద్వారా ఎంత విరాళ ఇచ్చినా ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు అనే సమాచారాన్ని బహిర్గతం చేయనవసరం లేదు. దీనివలన ప్రజలకు జవాబుదారీ తనం ఉండదు.
కార్పొరేట్ కంపెనీ లు అధికారంలో ఉన్న పార్టీ లకు పెద్ద మొత్తం లో విరాళాలు ఇచ్చి ప్రతిగా ప్రభుత్వం నుండి అక్రమ మార్గంలో ప్రతిఫలం పొందుతారు అని సుప్రీం కోర్టులో వాదన. ఇందులో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి.
ఈ చట్టాన్ని సాధారణ బిల్లులా లా కాకుండా ఆర్ధిక బిల్లులా లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఆర్ధిక బిల్లులపై ఓటు వేసే హక్కు కేవలం లోకసభ కే ఉంటుంది, రాజ్యసభకు ఓటు వేసే హక్కు ఉండదు కేవలం చర్చకు మాత్రమే అనుమతి ఉంటుంది. అందుకే ఈ చట్టాన్ని The Finance Act of 2016 and 17 పేరుతో 2017-18 బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని అమలు చేయాలి అంటే రాజకీయ పార్టీ లకి సంబందించిన విషయాలు, ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశాలు, కంపెనీ లకు సంబంధించిన అంశాలు, విదేశీ విరాళాలకు సంబంధించిన అంశాలు కూడా నిబిడీకృతం అయ్యి ఉండటం వల్ల, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951, ఆదాయపు పన్ను చట్టం-1961, విదేశీ విరాళాల క్రమబద్దీకరణ (FCRA) చట్టం-2010, మరియు కంపెనీల చట్టం- 2013 లను సవరించాల్సిన అవసరం ఏర్పడింది..
ఈ చట్టం రద్దు చేయాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వారు తర్వాత కేరళ లో అధికార పార్టీ అయిన CPI (M), జయా ఠాకూర్ అనే న్యాయవాది మరియు ఇతరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు:
ఈ చట్టం భారత రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుల్లో భాగం అయిన ఆర్టికల్ 19(1)- భావప్రకటన స్వేచ్ఛలో భాగం అయిన సమాచార హక్కుకు, అలాగే సమాచార హక్కు చట్టం-2005 కు వ్యతిరేకం అనీ, ఈ చట్టం చేసిన విధానం కూడా సరైన పద్దతి కాదని కేవలం ఫైనాన్స్ ఆక్ట్ అనే పేరు పెట్టి, రాజ్యసభలో ఓటింగ్ కు దూరం చేసి, 4 చట్టాలను సవరించడం కూడా రాజ్యాంగ విరుద్ధం అని, ఈ చట్టం ద్వారా మనీ లాండరింగ్ జరుగుతుంది అనీ, కార్పోరేట్ కంపెనీ లు అక్రమ మార్గం లో అధికార పార్టీలకు సొమ్ము ఇస్తూ వారి ద్వారా కాంట్రాక్టులు పొందుతున్నారని, ఇదొకరకమైన కార్పోరేట్ అవినీతనీ, షెల్ కంపెనీ ల ద్వార కూడా విరాళాలు అందుతున్నాయని వాదించగా. సుప్రీం కోర్టు వారితో ఏకీభవించి ఆ ఎలక్టోరల్ బాండ్ స్కీం ను రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది .
దానికి కొనసాగింపుగా ఇప్పటి వరకు ఏ ఏ పార్టీ కి ఎంత విరాళాలు వచ్చాయి? ఎవరు ఎంత విరాళం ఇచ్చారు అనే సమాచారాన్ని మార్చ్ 12 లోగా బహిర్గతం చేయాలని ఎస్బీఐ ని సుప్రీం కోర్ట్ ఆదేశించగా, జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని ఎస్బిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను కూడా సుప్రీం కోర్ట్ తిరస్కరించి వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని ఖరాకండి గా తేల్చి చెప్పగా ఎలక్షన్ కమీషన్ ద్వారా ఆ వివరాలను ఎస్బీఐ బహిర్గతం చేసింది..