రాయల సీమ జిల్లాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని చెప్పే నోటాకు పడే ఓట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది . 2014లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఆ ఓట్ల సంఖ్య 93 వేలు కాగా 2019 ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు 2.25 లక్లలకు పెరిగింది. అయితే శాసనసభ నియోజకవర్గాల్లో కన్నా పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా మొట్ట మొదటి సరిగా 2011-2013 మధ్యకాలంలో పోటీ చేస్తున్న వారు ఎవరూ నచ్చడం లేదని చెప్పే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలనే ఆలోచన కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చింది. నచ్చని అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేక ఓటు వేయకుండా పోవడం కన్నా తమ ఉద్దేశాన్ని చాటి చెప్పే విధానం ఎన్నికల ప్రక్రియలో తీసుకురావాలనే నిర్ణయం జరిగింది. ఆ క్రమంలోనే పోటీలో ఉన్నవారిలో ఎవరూ కాదు అనే అర్థంతో నోటా (నాట్ అబోవ్ ఆల్) అనే అంశం బ్యాలట్ పేపర్లో చోటు చేసుకుంది.
2011 నుంచి 2013 వరకు జరిగిన అప్ ఎన్నికలలో ఇది ప్రవేశ పెట్టిన , పూర్తి స్థాయిలో మాత్రం 2014 ఎన్నికల్లో అమల్లోకి తీసుకొని వచ్చారు . ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర చోట్ల లాగే రాయలసీమ పరిధిలోని 4 జిల్లాలకు చెందిన 52 శాసనసభ, 8 లోక్ సభ నియోజకవర్గాల బ్యాలట్ పత్రాలలో నోటా ప్రత్యక్షం అయింది. ఆ ఎన్నికల్లో రాయలసీమ పరిధిలో అటు ఎంపీ ఎన్నికలలో ఇటు ఎమ్మెల్యే ఎన్నికలలో సగటున 78 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మొత్తం లోక్సభ ఎన్నికల్లో 50,607 ఓట్లు, శాసన సభ ఎన్నికల్లో 48,088 ఓట్లు చొప్పున నోటాకు వచ్చాయి.
ఇక 2019 లో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే అటు లోకసభ ఎన్నికల్లో సగటున 90 శాతం, ఇటు శాసన సభ ఎన్నికల్లో సగటున 85 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో మొత్తం లోక్ సభ ఎన్నికల్లో 1,33,723 ఓట్లు, శాసనసభ ఎన్నికల్లో 91,973 ఓట్లు చొప్పున నోటాకు లభించాయి.
ఈ అంశాలను విశ్లేషించినప్పుడు నోటా గురించి పూర్తిగా అవగాహన లేక 2014 ఎన్నికల్లో తక్కువగా ఓట్లు వేశారని, అవగాహన కలిగిన తరువాత 2019 ఎన్నికల్లో నోటాకు ఓట్ల శాతం పెరగడం మనం క్లియర్ గా చూసాం. ఈ నేపథ్యంలో వచ్చే నెల మే 13వ తేదీన జరిగేబోయే సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్ల శాతాన్ని తగ్గించి తమకు ఓటు వేయించుకోవాలని ప్రధాన రాజకీయపక్షాల నాయకులలో కనిపిస్తుండగా, అసలు పోలింగ్ కు రాకుండా పోవడం కన్నా, తమ ఉద్దేశాన్ని స్వేచ్ఛగా తెలియచేయడానికైనా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి నోటాకు ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచితే చాలనే భావన అధికారుల్లో కనిపిస్తోంది.