ఆంధ్రప్రదేశ్ పై భానుడి ప్రతాపం తారాస్థాయికి చేరింది. మార్చి నెల ఇంకా పూర్తికాకనే సూర్యుడు భగభగ మంటున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలోనే వడగాలులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఒకవైపు వర్షం తక్కువ కావడంతో నీటి ఎద్దడి, మరోవైపు సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వీలైనంతవరకు బయట తిరగకుండా ఇంటిలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. నిప్పుల కుంపటిలా ఏపీ వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోని 31 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాదు రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు, వడగాలులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ రోజు 42 మండలాల్లో వడగాలులు, రేపు 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ మండలాల్లో ప్రజలు ఎండ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు.
వైయస్సార్ కడప లోని 18 మండలాలు, నంద్యాల జిల్లాలోని ఎనిమిది మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలోని 8 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు మండలాలు, గుంటూరు జిల్లాలోని ఒక మండలం, పల్నాడు జిల్లాలోని ఒక్క మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముసలివారు, చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉంటే మంచిదని తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల 42 డిగ్రీలు, కర్నూలులో 41.9, కడప 41.2 అనంతపురం జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.