సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఇళ్ల స్థలాలు అందజేశారు. తాజాగా లబ్ధిదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఆ భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయనుంది. రాష్ట్రం మొత్తంగా 31.19 లక్షల మందికి పట్టాలిచ్చిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లకు సంబంధించి శనివారం రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించారు. 29వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తిచేసి అర్హులకు కన్వేనియన్స్ డీడ్స్ ఇవ్వనున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం తరఫున∙అన్ని గ్రామాల్లోనూ వీఆర్వోలు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మరోవైపు.. కన్వేయన్స్ డీడ్స్ జారీకి సంబంధించిన ఆర్డినెన్స్ ఫైలుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం సంతకం చేశారు. గెజిట్, జీఓ శనివారం విడుదలయ్యాయి. ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసే పనుల్లో తలమునకలై ఉన్నాయి. ఇక ఈ రిజిస్ట్రేషన్లను 29న ప్రారంభించి 12 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు.
పదేళ్ల తర్వాత సర్వహక్కులు..
గతంలో పలు ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా రిజిస్ట్రేషన్లు చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు. అసైన్డ్ భూముల చట్టానికి అనుగుణంగా డీ–పట్టాలు ఇవ్వడంతో వాటిపై ఎటువంటి హక్కులు ఉండేవి కావు. కానీ వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చట్ట సవరణ చేసి మరీ సర్వహక్కులతో స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. 31.19 లక్షల మంది కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించారు. లబ్ధిదారులు పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా వాటిపై సర్వ హక్కులు పొందనున్నారు. ఇప్పుడు ఇచ్చే కన్వేనియన్స్ డీడ్స్ అప్పుడు సేల్డీడ్లుగా మారతాయి. లక్షలాది మంది కల సొంతిల్లు. దానిని నెరవేరుస్తున్న సీఎం జగన్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు.