రాష్ట్రం అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజలకు మంచి జరుగుతుంటే అడ్డుకోవడమే చంద్రబాబు నాయుడి పని. ఇందుకోసం కోర్టులో కేసులు వేయిస్తుంటారు. తమ నాయకుల్ని ఉసిగొల్పుతుంటారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, ఉన్న వాటిని తరిమేస్తున్నారని నాలుగున్నర సంవత్సరాలకు పైనుంచి పచ్చ గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. మరోవైపు కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకుండా తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇదెక్కడి రెండు కళ్ల సిద్ధాంతమంటూ ప్రజలు టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజాగా ఏమి జరిగిందంటే..
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2 వేల ఎకరాల్లో ఈపీసీ విధానంలో నిర్మాణాలకు ఏపీఐఐసీ బిడ్లు ఆహ్వానించింది. ఈ ఫార్మా హబ్ ద్వారా రూ.14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్తగా ఏర్పాటయ్యే 100కు పైగా ఫార్మా యూనిట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు. పరోక్షంగా వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇంత మెగా ప్రాజెక్టు ఏపీకి రావడం తెలుగుదేశానికి ఏ మాత్రం నచ్చలేదు.
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో భాగంగా నక్కపల్లి మండలం చందనాడ ఏపీఐఐసీ భూములను అధికారులు చదును చేయిస్తుండగా ఈ పనులను టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, గింజాల లక్ష్మణరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు మంగళవారం అడ్డుకున్నారు. టీడీపీ రైతులను రెచ్చగొట్టి, కమ్యూనిస్ట్ నేతలను ప్రలోభాలకు గురి చేసి పనులు ఆపించినట్లు విమర్శలున్నాయి. దీనికి రకరకాల కారణాలు చెప్పారు. అభివృద్ధికి విఘాతం కలిగించాలనే కుట్రతో టీడీపీ అధిష్టానమే వారి చేత ఆందోళన చేయించిందని ప్రచారం జరుగుతోంది. ఫార్మా హబ్ ఏర్పాటైతే వేలమందికి ఉపాధి దక్కుతుందని తెలిసినా.. మాకవన్నీ వద్దు.. రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పార్క్ వద్దని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కేంద్రానికి లేఖ రాశారు.
ఇక్కడిలా..
ఉయ్యాలవాడలో సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని అడ్డుకునేందుకు తెలుగుదేశం రైతులను రెచ్చగొట్టింది. రైతు సంఘం నాయకులను ముందుపెట్టి డ్రామా ఆడిస్తోంది. వాళ్ల చేత పరిశ్రమ వద్దంటూ గ్రామసభలో తీర్మానాన్ని ఇప్పించింది. ఎక్కడైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతించాలి. నిజంగా ప్రజలకు ఇబ్బందులు వస్తాయని భావిస్తే పరిష్కార మార్గాలు వెతకాలి. కానీ జరగడం లేదు.
2014–19 వరకు పరిశ్రమలు వెల్లువల్లా వచ్చేస్తున్నాయ్.. ఆ దేశం రెడీగా ఉంది. ఈ దేశం పెట్టుబడులు పెడుతోందని ఊదరగొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం పారిశ్రామికాభివృద్ధిని వ్యతిరేకిస్తోంది. ఇంకో వైపు జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని తాటికాయంత అక్షరాలతో తనే రాస్తుంది. ఎల్లో గ్యాంగ్ ఏడుపులే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష.