2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీలన్ని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి గెలవకుంటే తమ పార్టీ అస్థిత్వమే లేకుండా పోతుందని భయపడుతున్న జనసేన,టీడీపీ పార్టీలు పొత్తు కూడా ఖరారు చేసాయి. టీడీపీ జనసేన పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లంతా పార్టీ నుండి వెళ్లిపోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కి మరో పార్టీ రూపంలో కొత్త సమస్య ఏర్పడింది. ఆ పార్టీ పేరు భారతీయ జనసేన పార్టీ.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా అక్కడ జనసేన పార్టీ పేరును పోలినట్లున్న భారతీయ జనసేన పార్టీ కూడా కూకట్పల్లిలో పోటీ చేయడం గమనార్హం. భారతీయ జనసేన పార్టీ అభ్యర్థికి 800 పైగా ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కాగా, జాతీయ జనసేన గుర్తు బకెట్ కావడం విశేషం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు భారతీయ జనసేన పార్టీ ప్రకటించింది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కె.పవన్ కల్యాణ్ కావడం మరో విశేషం. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్ కావడం గమనార్హం.
పార్టీ అధ్యక్షుడి పేరుతో పాటు పార్టీ గుర్తులు రెండూ ఇంచుమించు ఒకేలా ఉండటం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. తమ పార్టీకి వచ్చే కొన్ని ఓట్లు కూడా భారతీయ జనసేన పార్టీకి పడే అవకాశం ఉందనే అనుమానం జనసేన సాధారణ కార్యకర్తల్లో కూడా వెల్లడవుతుంది. కాపు ఓటింగ్ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి పడే కొన్ని ఓట్లు కూడా చీలి భారతీయ జనసేన పార్టీకి పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఈ పార్టీ పవన్ కళ్యాణ్ కి కొత్త చిక్కులు తెచ్చిందనే చెప్పాలి.