ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ జారీ చేశారు.
తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించుచున్న చక్రి రాజశేఖర్ PC-2514 అను కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భాకరాపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం ఇచ్చిన హామీల పత్రాన్ని ప్రజలకు పంచుతూ కనిపించాడు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అనే నిబంధన ముందు నుంచి ఉంది, దానిని అతిక్రమించకూడదు. రాజశేఖర్ ప్రచారం చేస్తున్న సమయంలో స్థానికులు ఫోటో తీసి సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని పరిశీలించిన ఎన్నికల సంఘం కానిస్టేబుల్ ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని నిరూపణ అవడంతో వెంటనే సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతంగా తెలియపరచడం, ఏదైనా రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనడం వంటి చర్యల ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఈ సందర్భంగా హెచ్చరించారు.