ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిని మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల సభల్లో వారి టోపీ పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. ప్రచార రథం ఎక్కించుకుని హామీలు గుప్పిస్తున్నాడు. నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ముస్లిం నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
పొత్తులో భాగంగా టీడీపీ పడేసిన సీట్లు తీసుకుని పోటీ చేస్తున్న బీజేపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ముస్లింలను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దు, యూనిఫాం సివిల్ కోడ్, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాలు ముస్లింలను కలవరపెడుతున్నాయి. దీంతో కమలం పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరితో చంద్రబాబు పొత్తును జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది మతపెద్దలు టీడీపీ విధానాలను బహిరంగంగానే తప్పు పడుతున్నారు.
చంద్రబాబు ఇటీవల మేనిఫెస్టో ప్రకటించారు. ఇందులో అనేక అబద్ధాల హామీలిచ్చారు. అందులో ఒకటి ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనాలు ఇస్తామని నోటికొచ్చింది ప్రకటించారు. వీటి గురించి బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కానీ వారు పెడుతున్న పోస్టుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫొటోలు తీసేశారు. సాధారణంగా ప్రతి దాంట్లో వారందరి ఫొటోలను నేతలు తప్పనిసరిగా పెడుతుంటారు. కానీ ఇది ముస్లింలకు సంబంధించిన విషయం కావడం, వారి ఫొటోలు కనిపిస్తే ఓట్లు వేయరనే భయంతో తీసేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి అయితే తన బాస్ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్థి చిన్ని ఫొటోలను మాత్రమే పోస్టులో ఉంచాడు. కనీసం తమ అధినేతల చిత్రాలు పెట్టి ఓట్లు అడిగే ధైర్యం కూడా వీరికి లేకుండా పోయింది.