గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకాలకు నేడు పలు ప్రాజెక్టులు బలవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోకుండా వాటి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను కాజేయడంతో పలు ప్రాజెక్టుల గేట్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోవడం వెనుక టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే అసలు కారణం.
గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు 2008 లో పూర్తి చేసి జాతికి అంకితం చేయగా 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు సీఎంగా కాలంలో(2014-2019) గుండ్లకమ్మను తనిఖీచేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ కొత్త గడ్డర్లు ఏర్పాటుచేయాలని గేట్లకు మరమ్మతు చేయాలని నివేదిక ఇచ్చింది. కానీ చంద్రబాబు తూతూమంత్రంగా పనులు చేపట్టి, రూ.5.15 కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే ప్రాజెక్టు పాలిట శాపంగా మారింది. గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం పేరుతో నిధులు కాజేయడంతో గేట్లు తుప్పు పట్టిపోయాయి.
గతేడాది గేటు కొట్టుకుపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు మరో రెండు గేట్లు బలహీనంగా ఉండటంతో యుద్ధప్రాతిపదికన రూ.1.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేసింది. మిగిలిన 10 గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం, దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, కొత్త వైర్ రోప్‌లు, గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు పనులకు రూ.9.14 కోట్లతో టెండర్లను కూడా పిలవడంతో రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆ పనులను రాజస్థాన్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ సంస్థ దక్కించుకుంది.
డిసెంబర్ 8, 2023న అధికారులు టెండర్ ఖరారు చేశారు. కాగా మిచాంగ్ తుఫాను ధాటికి టెండర్ ఖరారైన రోజే వరద ఉద్ధృతికి రెండో గేటు కొట్టుకుపోవడం గమనార్హం. అప్పట్లో చంద్రబాబు ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.