2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతరఫున టికెట్ ఆశించి భంగబడ్డ 8 మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకొని తిరిగి టిడిపి పార్టీలో చేరి పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంకి చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టిడిపి తరఫున టికెట్ ఆశించి భంగపడ్డాడు. నూజివీడు సీట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొలుసు పార్థసారధికి కేటాయించడంతో టిడిపి పై అలిగి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి గత రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. టీడీపీ అధిష్టానం ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించినప్పటికీ వెంకటేశ్వరరావు సముఖత చూపలేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత టిడిపి చేసిన ప్రయత్నాలు సఫలం అవడంతో నామినేషన్ వెనక్కి తీసుకొని టిడిపిలోకి చేరడానికి సిద్ధం అయ్యాడు.
అనకాపల్లి జిల్లా మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. మొదట ఎన్నారై పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది కానీ అనూహ్య పరిణామాలతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల టికెట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేటాయించారు. దీంతో అప్పటికే నామినేషన్ వేసిన పైలా ప్రసాద్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారి పోటీలో ఉంటానని ప్రకటించారు. కానీ టిడిపి అధిష్టానం చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో పైలా ప్రసాద్ తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తిగెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. మరికొన్ని స్థానాల్లో కూడా టీడీపీకి రెబల్ అభ్యర్థుల పంచాయితీ ఉంది.. వారితో కూడా టిడిపి అధిష్టానం భేటీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.