ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు స్కోర్ చేసింది. చెన్నై ఓపెనర్లు పెద్దగా రాణించకపోయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆజింక్యా రహానే, శివం దూబే ఇద్దరూ రాణించడంతో ఒక దశలో చెన్నై భారీ స్కోరు దిశగా సాగింది. దూబే 24 బంతుల్లో 45 పరుగులు ( 4 సిక్స్ లు , 2 ఫోర్లు ) రహానే 30 బంతుల్లో 35 పరుగులు చేసి వెనుదిరిగారు, తరువాత వచ్చిన జడేజా 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
హైదరాబాద్ బౌలర్లు అధ్బుత బౌలింగ్ తో చివరి 7 ఓవర్లలో 50 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడంతో చెన్నై భారీ స్కోర్ కి గండి పడింది. మెయిన్ బౌలర్లు అందరూ తలో వికెట్ తీసుకున్నారు
166 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాటర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు , పవర్ ప్లే 6 ఓవర్లలోనే 78 పరుగులు చేసి జట్టు గెలుపుకు గట్టి పునాది వేసారు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ పవర్ ప్లే 2 వ ఓవర్ లో 27 పరుగులు రాబట్టడం అతని దూకుడు ఆట తీరుకు నిదర్శనం, కేవలం 12 బంతుల్లో 37 పరుగులు ( 4 సిక్స్ లు , 3 ఫోర్లు ) సాధించి వెనుదిరిగాడు , ఇంకో ఓపెనర్ హెడ్ 24 బంతుల్లో 31 పరుగులు చేసాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యాకా లక్ష్య చేదనలో కొంచెం వెనుకబడినట్టు కనిపించినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్కరమ్ 36 బంతుల్లో 50 పరుగులు ( 4 ఫోర్లు 1 సిక్స్ ) తో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపును సులభతరం చేసారు
ఈ మ్యాచ్ తో ఆరంగేట్రం చేసిన మన తెలుగు కుర్రోడు నితీశ్ రెడ్డి విన్నింగ్ సిక్స్ తో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో సొంత గడ్డపై గెలుపును సొంతం చేసుకుంది . సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే 166 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది, చెన్నై బౌలర్లలో మెయిన్ ఆలీ 2 వికెట్లు , దీపక్ చాహర్ , మహేష్ తీక్షణ చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ ను కుటుంబ సమేతంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు , అంతేకాక సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించడం విశేషం.