ఏపీలో 2023-24 పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. కాగా ఈ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి కనీవినీ ఎరుగని రికార్డును సాధించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా సబ్జెక్టుల్లో ఆమె వంద శాతం మార్కులు సాధించడం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె సాధించిన మార్కులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె సాధించిన మార్కుల పట్ల పలువురు శుభాకాంక్షలు చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా పదవ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటడం గమనార్హం.. కాగా ఈ ఏడాది 6,16,615 మంది పదవ తరగతి పరీక్షలు రాయగా 5,34,578 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. పరీక్షలు రాసిన వారిలో 86.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. మన్యం జిల్లా మొదటి స్ధానంలో ఉండగా.. కర్నూలు జిల్లా చివరి స్ధానంలో నిలిచింది. మన్యం జిల్లాలో 96.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా కర్నూలు జిల్లాలో కేవలం 62.47 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో ఉత్తీర్ణత 71.08 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 92.32 శాతం, హిందీ మీడియంలో 100 శాతం ఉత్తీర్ణులయ్యారు.