రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది జాబితా తయారుచేయాలని, ప్రతి జిల్లాలో సిబ్బంది సంఖ్య ప్రాధమిక అంచనా కంటే 20% అదనంగా అధికాంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటరు జాబితా తయారీ, ఓటరు గుర్తింపుకార్డుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాటు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసీ అధికారులు.
పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగేతర విధులకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని అన్ని జిల్లాల ఎస్పీలను సీఈవో మీనా ఆదేశించారు. అన్ని జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేజర్ రూట్లతో పాటూ మైనర్ రూట్లలోనూ నిరంతరం పర్యవేక్షణ ఉండేలా మొబైల్ స్క్వాడ్ లు, స్టాటిక్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం, ఎన్నికలు జరిగిన సమయాన్ని ప్రాధమికంగా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లపై ముందుకెళ్తున్నారు.