ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా సొంగా రోషన్కుమార్ను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో చింతలపూడిపై ఆశలు పెట్టుకున్న పీతల సుజాతకు నిరాశే ఎదురైంది. 2019 ఎన్నికల్లో కర్ర రాజారావు ఓటమి తరువాత చింతలపూడి టీడీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు వల్ల ఏ ఒక్కరినీ ఇన్చార్జ్గా చంద్రబాబు ఎంపిక చేయలేదు. తాజాగా ఎన్నారై రోషన్ కుమార్కు చింతలపూడి టికెట్ ను టీడీపీ కట్టబెట్టింది.
గతంలో టీడీపీలో చింతలపూడి నియోజకవర్గం నుండి గెలిచిన పీతల సుజాతకి మంత్రి పదవి కూడా దక్కింది. కానీ మాగంటి కుటుంబంతో విభేదాల కారణంగా పీతల సుజాతకు మంత్రి పదవి నుండి తప్పించారనే విమర్శలున్నాయి. ఇక్కడ గెలిచిన అభ్యర్థులపై కమ్మ నేతలు ఆధిపత్యం చెలాయించడం పరిపాటిగా మారిపోయింది. దళిత అభ్యర్థి ఎవరైనా తాము చెప్పిన చోట సంతకాలు పెట్టేవాళ్లై ఉండాలని మాగంటి బాబు అప్పట్లో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాతకు టికెట్ దక్కకపోవడం వెనుక చింతమనేని పాత్ర కూడా ఉందని అప్పట్లో పుకార్లు హల్ చల్ చేసాయి. తాజాగా చింతలపూడి సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పీతల సుజాతను కాదని వేరొకరికి ఆ సీటును కేటాయించడం చూస్తుంటే పీతల సుజాత రాజకీయానికి చెక్ పడినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
చింతలపూడి సీటుపై పీతల సుజాతతో పాటు బొమ్మాజి అనిల్, ఆకుమర్తి రామారావులు కూడా ఆశలు పెట్టుకున్నారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన దానం కుమారుడు బొమ్మాజీ అనిల్ దాదాపు చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. దాంతో చింతలపూడి నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను నాయకులను కలసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆకుమర్తి రామారావు కూడా నియోజకవర్గంలో కేడర్ కు సాయం చేస్తూ టికెట్ ఆశించారు. వీరందరిని కాదని ఎన్నారై అయిన సొంగా రోషన్కుమార్ను చంద్రబాబు ఆదేశాలతో నియమించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.