మంగళవారం నాడు ఉత్తరాంధ్రలో అమ్మవారిగా కొలిచే పైడి తల్లి సిరిమానోత్సవం కన్నుల పండుగగా క్రిక్కిరిసిన భక్తుల మధ్య జరిగింది. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో గ్రామదేవత పేరు పైడితల్లి. ఈ తల్లిని పూజించుకుంటూ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంగా దీన్ని ప్రతి యేటా జరుపుకుంటారు
సిరిమానోత్సవంలో కొక్కెం చివర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద గుడి పూజారి కూచుని ఉంటే, ఆ పొడుగాటి గడను గుడి చుట్టూ తిప్పుతారు. అంటే గుడి చుట్టూ పూజారి ప్రదక్షిణం చేస్తాడన్నమాట. పూజారిని ఒక వ్యక్తి భుజం మీద ఎక్కించుకుని మోసుకుంటూ మాను వద్దకు తీసుకెళ్లడంతో ఉత్సవం మొదలైంది. ఉత్సవం, ప్రదక్షిణం ముగిసిన తర్వాత సిరిమాను ఎక్కిన పూజారికి ప్రత్యేక పూజలు నిర్వచించి గౌరవించుకుంటారు.ఇది విజయనగరంలో ప్రతి యేటా వైభవంగా భక్తితో జరుపుకునే ఉత్సవం.
ఈ ఉత్సవానికి కొంత చరిత్ర ఉంది.
1757 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు. అయితే ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలియుద్ధం. పెదవిజయరామరాజు చెల్లెలు పైడిమాంబ మరణమే సిరిమానోత్సవానికి నాంది పలికింది.
పైడిమాంబ చిన్నతనం నుంచి అమ్మవారి భక్తురాలు. యుద్ధం ఇరువంశాలకు మంచిది కాదని అపాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన అన్న పెద విజయరామరాజును హతమార్చేందుకు జరుగుతున్న కుట్రను తెలియచేసేందుకు బయలుదేరిన పైడిమాంబకు తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయరామరాజు మరణించారనే వార్త తెలుస్తుంది. యుద్ధం అపేందుకు తాను చేసిన ప్రయత్నాలు వృధా కావడం, ఆ యుద్ధంలోనే తన సోదరుడు మరణించడం ఆమె తట్టుకోలేకపోతుంది. తన మరణంతోనైనా యుద్దానికి ముగింపు కలగాలని, సామరస్యం వెల్లి విరియాలని కోరుకుంటూ…తాను ప్రతిమగా మారి దేవిలో ఐక్యమైపోతున్నానని చెప్పి ఆమె పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
ఇదే సిరిమానోత్సవం జరగడానికి కారణమైన తొలి సంఘటన
కొందరు జాలర్ల సహాయంతో పైడిమాంబను చెరువు నుంచి వెలికి తీసేందుకు అప్పట్లో పైడిమాంబ అనుచరుడిగా ఉన్న పతివాడ అప్పలనాయుడు ప్రయత్నం చేస్తాడు. పెద్ద చెరువులో పైడిమాంబ విగ్రహారూపంలో కనిపిస్తుంది. దానిని తీసుకుని వచ్చి దగ్గర్లో ఉన్న తోటలో ఒక గుడికట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనినే ప్రస్తుతం వనంగుడి అని పిలుస్తున్నారు. ప్రజలను కరువు, వ్యాధుల నుంచి కాపాడేందుకు విగ్రహారూపంలో తాను దొరికిన నాడే తనకు ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు స్థానికులు చెబుతారు.
“వనంగుడి అడవిలో ఉండటంతో భక్తులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, తనకు మరోచోట గట్టు పై గుడి కట్టాలని అమ్మవారు రాజవంశీకుల కలలో కనపడి చెప్పారని చెబుతారు. దాంతో ప్రస్తుతం ఉన్న మూడు లాంతర్ల సెంటర్ వద్ద మరో ఆలయం కట్టారు. దీనినే చదురుగుడి అంటారు. అమ్మవారు వెలిసిన వనం గుడి నుంచి ఆశ్వయుజమాసంలో చదురుగుడికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆరు మాసాలు ఉన్న తర్వాత చైత్రమాసంలో ఇక్కడికు తీసుకుని వస్తారు. అంటే వనంగుడిలో ఆరునెలలు, చదురుగుడిలో ఆరునెలలు ఉంటారని భక్తుల నమ్మకం.
సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు అమ్మవారు తమ కలలో కనిపించి సిరిమాను చెట్టు ఎక్కడుందో తెలియచేస్తారట . పైడిమాంబ విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా ఉన్నారు. “చింతచెట్టు మానునే సిరిమానుగా ఉపయోగిస్తారు. అమ్మవారు చెప్పిన ఈ చింతచెట్టును వడ్రంగులు సిరిమాను గా చెక్కుతారు. ఈ సమయంలోనే భక్తులు హుకుంపేటలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించడం, చింతమానును సిరిమానుగా మార్చడంలో నీళ్లు, పసుపు చల్లుతూ సహాయం చేస్తారు
హిందూ ఆలయాల్లో ధ్వజ స్థంభానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటిని చెట్లమానుల నుంచే తయారు చేస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికి ఉన్న రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజస్థంభాలుండవు. పైడితల్లి అమ్మవారి గుడిలో విడిగా ధ్వజ స్థంబాలు ఉండవు. ఈ ధ్వజస్థంభాన్నే సిరిమాను రూపంలో ప్రజల వద్దకు తీసుకుని వెళ్తారు . దానిపై కూర్చున్న పూజరిని అవహించి ఆమె, ప్రజలకు, రాజకుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తుంది అని ప్రజల నమ్మకం.
ప్రధాన ఉత్సవం రోజున సుమారు 60 అడుగుల పొడవుండే సిరిమాను చివరన పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను పైకి లేస్తుంది. ఈ సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోటవరకు మూడుసార్లు తిరుగుతుంది. రాజకుటుంబీకులు, ప్రముఖులు కోట బురుజు వద్ద కూర్చుని అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి రూపంగా భావించే సిరిమానును అధిరోహించిన పూజారి అందరికీ దీవెనలు అందిస్తారు.
ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్ ఘడ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా వస్తారు. ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. దానిని రైతులు తీసుకుని వాటిని ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతారు. ఇదంతా కూడా మంచి పంటలు పండుతాయనే నమ్మకంతో చేస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం, ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఆ ఏడాది అమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగుస్తాయి.