రాష్ట్ర సమాచార కమిషన్(అర్టిఐ) కు నియమించబడిన ముగ్గుర నూతన కమిషనర్లు రెహానా బేగం, చావలి సునీల్ ,అల్లారెడ్డి ఉదయభాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహార్ రెడ్డి ప్రమాణం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్లపాటు వీరు పదవిలో ఉంటారు. రెహనా బేగం గతంలో పలు మీడియా సంస్థలు రిపోర్టర్ గా పనిచేశారు, చావలి సునీల్ ఆల్ ఇండియా త్రోబాల్ ప్లేయర్ కాగా ఉదయ్ భాస్కర్ రెడ్డి గురించి ఏ విషయాలు బయటకు తెలియదు.
వీరిలో రెహానా ప్రముఖ జర్నలిస్ట్ . జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోద్ధాత్మక కథనాలు, సాహసపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబై మారణహోమం లైవ్ కవరేజ్ ,ఉత్తరాఖండ్ వరదల రిపోర్ట్ ,సర్జికల్ స్ట్రైక్స్ ,పుల్వామా ఉగ్రదాడి వంటి వార్తలను కవర్ చేశారు. దేశంలో 17 రాష్ట్రాల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. అంతర్జాతీయ సరిహద్దులలో పని చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో సరిహద్దుల్లో పేరుతో తెలుగులో పుస్తకం తెచ్చారు ఈ పుస్తకం ఫ్రాంటియర్ పేరుతో ఇంగ్లీష్ అనువాదం అయింది. టర్కీ కవరేజ్ కి వెళ్లి టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు, తెలంగాణ ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇచ్చారు. గతేడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజర్ కమిటీ సభ్యురాలుగా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా సభ్యురాలుగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.