వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ బరిలో ఉంటారని తేలింది. గూడూరులో జరిగిన సామాజిక సాధికార యాత్రలో అనిల్ మాట్లాడారు. జగన్ ఆదేశాలకు సై అన్నారు. తనకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు జగనన్న ఇచ్చిన బిక్ష అని, ఆయన ఆదేశాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సీటు విషయంలో అలిగి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆర్థికంగా బలవంతుడైన లావును ఎదుర్కోవడం వైఎస్సార్సీపీకి సాధ్యమైనా అనే అనుమానాలు వ్యక్తమవయ్యాయి. కానీ యువతలో మాస్ ఫాలోయింగ్ ఉన్న అనిల్ పోటీకి రెడీ అనడంతో శ్రీకృష్ణదేవరాయులు పోటీ చేయొకపోవచ్చని పల్నాడు వాసులు అభిప్రాయపడుతున్నారు. అనిల్ నరసారావుపేటలో పోటీ చేయడని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే జగనన్న గీత గీస్తే దాటనని అనిల్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ల నోళ్లు మూయించారు. సీఎం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని కోరారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో చంద్రబాబు గురించి మాట్లాడానని, ఇకనుంచి ఢిల్లీలో మాట్లాడుతానని చెప్పారు.
అనిల్ 2014, 2019లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచారు. 19లో మాజీ మంత్రి పొంగూరు నారాయణపై గెలిచి సత్తా చాటారు. మంచి వాగ్దాటి గల నేతగా అనిల్‌కు పేరుంది. బీసీ నాయకుడిగా ఎదిగారు.