ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు రాజస్థాన్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొననుంది, గత రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 4లో చోటు సంపాదించాలని చూస్తుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. ప్లే ఆఫ్ కి అర్హత సాధించడమే లక్ష్యంగా మ్యాచుకు సిద్ధమైంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో మినహా.. మిగతా మ్యాచులన్నిటిలోనూ రాజస్థాన్ గెలిచింది ఆడిన 9 మ్యాచుల్లో 8 గెలిచి దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
ఇక ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జాస్ బట్లర్లతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయంలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌లతో బలంగా కనిపిస్తోంది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ రాణించడంతో ఈ సీజన్ తొలి అర్థభాగంలో రికార్డు స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడు డీలా పడింది. గత రెండు మ్యాచుల్లో ఓపెనర్లు విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. రెండు సార్లు కూడా ఛేజింగ్లోనే ఓడిపోవడం గమనార్హం. ఇవాళ జరిగే మ్యాచులో గెలిచి మళ్లీ గెలుపుబాట పట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
ముఖ్యంగా బౌలింగ్‌లో సన్ రైజర్స్ తేలిపోతోంది. బ్యాటింగ్ మెరుపులతో మ్యాచులు గెలిచినా.. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మ్యాచు నుంచైనా భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు
ప్లేయింగ్ ఎలవన్ అంచనా :
సన్ రైజర్స్ హైదరాబాద్ :
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్
రాజస్థాన్ రాయల్స్ :
యశస్వి జైశ్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్