సాధారణ హీరో నుంచి పవర్‌స్టార్ వరకూ ఎదిగి, పదేళ్ళు హిట్లు లేకపోయినా అభిమానగణాన్ని అలానే నిలుపుకుని సినిమాల్లో ఒక స్థాయికి వరకూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం సినిమా వరకూ ప్రత్యేకమైనదీ మరియు ఆసక్తికరమైనదే. అయితే ఆ తర్వాత రాజకీయాలు ఎత్తుకున్నాక ఆయన గతి తప్పింది. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం అంటూ తిరిగినా అన్న చాటు తమ్ముడిగానే ఉండిపోయాడు తప్ప, అతని నిజమైన భావాలను బయటపెట్టే అవకాశం రాలేదు.
అయితే ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి చెప్పినట్టు “ఆకాశంబు నుండి శంభుని శిరం” తరహాలో తన స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయాక రాజకీయిలలోకి వచ్చి అచ్చం ఆ గంగ లానే తన స్థాయిని కూడా అధఃపాతాళానికి స్వయంగా తొక్కేసుకుంటున్నారు పవన్‌కళ్యాణ్. రాజకీయాల్లో వైరుధ్యాలు మామూలే అయినపుడు, స్నేహాలకి కూడా పరమార్థాలనుప్పుడు ఏ రాజకీయ నాయకుడి ప్రవర్తననీ, ప్రణాళికలనీ తప్పుపట్టే అవకాశం లేదు. కానీ ప్రణాళికంటూ లేకుండా ప్రవర్తిస్తేనే అతని గురించి ఆలోచించవలసి వస్తుంది.
ఒక రాష్ట్రానికి నాయకుడిని ఎన్నుకోడానికి నా సహాయం కావలసి వచ్చింది అని రొమ్ము విరుచుకుని చెప్పే పవన్ కళ్యాణే కాసేపటికి మన దగ్గర బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరు అంటూ భుజాలు వెలాడేసుకుని డీలా పడతారు. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో, పొత్తుల్లో ఏమిటీ వైరూధ్యాలు అనేవి ఆయనకు తెలుస్తాయో లేదో మరి.
2014 లో టీడీపీకి నా మద్దతు అని తెలిపినా, ప్రశ్నిస్తా అన్నారు కదా అని ప్రజలంతా రకరకాల ప్రశ్నలు ఆయన ముందు నిలిపినపుడు... తూతూ మంత్రంగా చంద్రబాబును నిలదీసినా, తర్వాత ఎన్నికల్లో ఒంటరిపోరు చేసి మాయావతితో జాతి కట్టినా, ఆపై మళ్ళీ బీజేపీ, టీడీపీ అంటూ తిరుగుతున్నా అన్నీ వివేకం లేని ఆవేశపూరిత నిర్ణయాలుగా కనిపిస్తాయి తప్ప… ఒక పంధాలో వెళుతున్నట్టుగా ఉండవు. వారాహి ఎక్కి చంద్రబాబునూ, వైయస్ జగన్‌ను తిట్టి, ఇప్పుడు వారాహి దిగాక చంద్రబాబుతో సభా వేదికపైకెక్కి జగన్‌ను తిడుతున్నారు.
లీడర్ సినిమాలో ఒక పాత్ర “చెప్పులు కుట్టేడోకి చెప్పులుంటాయా… ఇళ్ళు కట్టేటోడికి ఇళ్ళుంటదా…” అన్నట్టు… రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం తన మద్దతుని ఇచ్చే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. పోనీ ఈ సారయినా తమ పొత్తు అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెప్పడం మానేసి…. కేవలం జగన్ ను దించడమే తన జీవిత ధ్యేయమని సిగ్గు లేకుండా వేదికల మీద చెప్పుకుంటున్నాడు. ఒక హీరో స్థాయి నుంచి వేదికల మీద కామెడీ చేసుకునే స్థాయికి తనంతట తానే పడుతూ వచ్చాడు. పెక్కుభంగుల్ వివేకభ్రష్టసంపాతముల్…. అన్నట్టు వివేకం కోల్పోయి అధహహ పాతాళానికి (ఆయన భాషే) తనంతట తానే జారిపోతున్నారు.