మరో రెండునెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ముందంజలో దూసుకుపోతూ తాము ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సవాలు విసురుతుంటే ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మాత్రం తమ పొత్తుపై పెదవి విప్పడం లేదు. పైగా అభ్యర్థులను ప్రకటించడంలో కూడా ఎలాంటి కసరత్తు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ బీజేపీ అధిష్టానంతో చర్చించి పొత్తులపై అభ్యర్థుల ఎంపికపై తుదినిర్ణయం తీసుకోనున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
సీఎం జగన్ ని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించి పొత్తుకు తహతహలాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. టీడీపీ జనసేన కలిసినా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని భావించి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. బీజేపీతో పొత్తుకు అలుపెరుగని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చిన చంద్రబాబు విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబించిన బీజేపీ అధిష్టానం చివరకు చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చింది. అమిత్ షాను చంద్రబాబు కలిసినపుడు తన అనుకూల మీడియాలో టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరించిందని పొత్తు పెట్టుకోవడం కోసమే చంద్రబాబును పిలిపించారని పదే పదే చెప్పించారు. కానీ ఈ వార్తల విషయంలో బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.
చంద్రబాబు అమిత్ షాను కలిసిన అనంతరం కొన్ని రోజులపాటు పొత్తుల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ అయిపోవడం అనేక సందేహాలకు తావిచ్చింది. అసలు పొత్తు ఉందా లేదా అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమయ్యాయి. బీజేపీ ఎక్కువ సీట్లను అడుగుతుందని అందుకే పొత్తు ఖరారు కావడం లేదనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం నుండి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు రెండు నెలలు కూడా లేని తరుణంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతుండగా రాయబారం కోసం పిలిచిందా లేక తమతో పొత్తు కావాలంటే టీడీపీతో పొత్తు వద్దని చెప్పడానికి పిలిచిందా? లేదా టీడీపీతో పొత్తులో ఉంటే తాము ఒంటరిగా పోటీ చేయనున్నామని క్లారిటీ ఇవ్వబోతుందా అసలు పవన్ కళ్యాణ్ ను బీజేపీ పిలవడంలో ఉన్న అంతరార్ధం ఏమిటన్న అనేక సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఈ సందేహాలకు ఇంకో మూడు రోజుల్లో సమాధానం లభించనుంది.