రాష్ట్ర విభజన తరువాత ఆర్ధికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటి అమలుపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. 2014 లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి ప్రజల నమ్మకాన్ని పొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి ప్రధాన కారణం నాడు ఉన్న మోడీ గాలిలో బీజేపి కచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని. సదరు పార్టీతో టీడీపీ పొత్తులో ఉన్నందున ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు నమ్మడమే. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకి నాది భాద్యత అని పవన్ కళ్యాణ్ సైతం పెద్ద ఎత్తున ఎన్నికల సభల్లో హామీలు ఇవ్వడమే.
ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణలో ఓటుకు నోటు , ఏపీలో అమరావతి గ్రాఫిక్స్ అంటూ స్వార్ధ రాజకీయాలు చేసిందే కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం గాలికి వదిలేసింది. కనీసం పొత్తులో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి విభజన హామీలుగా రావాల్సినవి కూడా సాధించలేకపోయింది. ఇక వీళ్ల హామీలకి తాను పూచి అన్న పవన్ కళ్యాణ్ ముఖం చాటేశాడు. చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న సమయంలోనే బయటికి వచ్చి పొంతన లేని మాటలతో నాటి ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పై అర్ధంలేని ఆరోపణలు చేసి వెళ్ళిపోయేవాడు.
టీడీపీ ప్రభుత్వం విధానాలతో నష్టపోయిన అన్ని రంగాలకి భరోసా కల్పించే ఆలోచనతో నాటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రకి ప్రజల్లో ఆపూర్వ స్పందన రావడం. టీడీపి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తం అవ్వడంతో. నష్ట నివారణ చర్యల్లో భాగంగా టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పొత్తు పై యు-టర్న్ తీసుకుంది. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు బాటే పట్టాడు. బీజేపిపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుమ్మెత్తి పోసారు. అప్పటి వరకు కేంద్రాన్ని పల్లెత్తు మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ హటాత్తుగా ఎన్నికలకి ఏడాది ఉందనగా 2018 మార్చ్ లో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ‘జేఎఫ్సీ’ అంటూ ఒక కమిటీని వేసి ఉండవల్లి అరుణ్ కుమార్, జయ ప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, మాజీ హోం సెక్రటరీ పద్మనాభయ్య లాంటి వారిని ఆ కమిటీలో భాగస్వామ్యం చేశారు.
అయితే ఈ కమిటీ పలు భేటీలు జరిపి విభజన హామీలపై కేంద్రం ఎంతవరకు అమలుచేసిందనే అంశాలపై చర్చించి ఒక నివేధికను తయారు చేశారు. ఆ నివేధిక ప్రకారం నాడు కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా ఇంకా రాష్ట్రానికి 74,542 కోట్లు ఇవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. స్పెషల్ ప్యాకేజీ కింద 16,447 కోట్లు, రెవెన్యూ లోటు 10,225 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకి 22,250 కోట్లు, విశాఖ చెన్నై కారిడార్ కి 6,000 కోట్లు, కాకినాడ పెట్రో కాంప్లెక్ కి 5,000 కోట్లు ఇలా మరికొన్ని హామీలతో కలిపి నివేదిక అందచేశారు. ఈ నివేదికను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ హామీలు సాధించే వరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడతానని, తాను రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటానని , తనకి భయం లేదని, కేంద్ర ప్రభుత్వం నుండి హామీలు సాధించడంలో తెలుగుదేశం విఫలం చెందిందని కూడా ఒక మాట ఆవేశంగా అనేశారు.
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగడం అటు టీడీపీ, ఇటు జనసేన ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విఫలం చెంది దారుణమైన ఓటమిని మూటకట్టుకున్నారు. అయితే కేంద్రంతో విభజన హామీల అమలుపై రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోరాడతానన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీవ్రంగా విమర్శించిన బీజేపీతోనే పొత్తు పెట్టుకుని అందరిని ఆశ్చర్య పరిచి తన నిలకడ లేని మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. మరో వైపు తెలుగుదేశం విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందింది అన్న పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకూడా మాకు చంద్రబాబుతో దశాబ్ధం పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ముఖ్యమంత్రిగా జగన్ గారు కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఇప్పటికే రెవెన్యూ లోటు కింద రావాల్సిన 10,461 కోట్లు సాధించారు, జగన్ గారి డిమాండ్ మేరకు కేంద్రం వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ కింద రావాల్సిన 22వేల కోట్లు కోసం కసరత్తు ప్రారంభించింది. ఇలా ఒక్కొక్క మొండి సమస్యని పరిష్కారం దిశగా అడుగులు వేయిస్తున్నారు . అయితే విభజన హామీల కోసం నిజనిర్ధారణ కమిటీ ‘జేఎఫ్సీ’ ఏర్పాటు చేసి ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడతానన్న పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోటు సాధిస్తే అభినందనగా ఒక్క మాట కూడా పలకలేదు. అలాగే విభజ హమీలు సాధించడంలో పూర్తిగా విఫలం చెందిన తెలుగుదేశం తో దశాబ్దాల పాటు పొత్తు ఉండాలని కోరుకోవడం చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్తశుద్ది ప్రజలకి ఇట్టే అర్ధమైపోతుంది.