జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబు ఆంధ్రప్రదేశ్లో ఓటు నమోదుకు ఎన్నో అడ్డదారులు తొక్కి చివరికి నవ్వులపాలయ్యారు. నిద్ర లేచింది మొదలు సోదరులిద్దరూ నీతి వాఖ్యాలు వల్లిస్తుంటారు. కానీ చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు.
ఓ వైపు పవన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన దత్త తండ్రి చంద్రబాబు కోసం వీకెండ్ పొలిటీషియన్ అవతారమెత్తాడు. నాగబాబు టీవీ షోలు, సినిమాలు చేస్తూ జనసేన నాయకుడి హోదాలో అడపాదడపా జిల్లాల్లో తిరుగుతుంటాడు. పని పూర్తయ్యాక ఇద్దరూ తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోతుంటారు. వాళ్ల పిల్లలు ఎక్కడుంటారో.. ఏం చేస్తుంటారో.. అందరికీ తెలిసిన విషయమే. జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ ఓటు నమోదు చేసుకోగా.. ఇది దొంగ ఓటంటూ ప్రజల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అలాగే నాగబాబు దొడ్డి దారిన రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుకు పూనుకుని అభాసుపాలయ్యాడు.
ఏం జరిగిందంటే..
నాగబాబు, అతని భార్య, కొడుకు, కుమార్తె, కోడలి నివాస ప్రాంతం హైదరాబాద్. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అంటే గత సంవత్సరం డిసెంబరు 4 తేదీన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో వడ్డేశ్వరం – రాధా రంగ నగర్లో 5–263 ఇంటి అడ్రసు పేరుతో ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేశారు. కుటుంబం మొత్తం ఆ ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటపడి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. దీంతో నాగబాబు కవర్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు. కాగా∙ప్రాథమిక స్థాయిలో బూత్ లెవల్ అధికారి పరిశీలనలో నాగబాబు, ఆయన కుటుంబం అక్కడ నివాసం ఉండటం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా∙మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సదరు ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే వారి తరఫున సంబంధిత అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే అధికారుల ముందు హాజరైనట్లు తెలిసింది.
అన్నీ అబద్ధాలే..
ఓటు విషయంలో నాగబాబు ఆడిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. మెగా బ్రదర్స్ ఎక్కడుండేది?, ఏంచేసేది? ప్రజలందరికీ తెలిసినా మాటలు మార్చి చెప్పారు. తాను తాడేపల్లిలో నివాసం ఉంటున్నానని, అయితే ప్రస్తుతం వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉన్నందున స్వయంగా విచారణకు రాలేకపోయినట్లు సంతకం చేసిన ఒక పేపర్ ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మరో ఇద్దరు ఇలాగే రాసి.. దానిని ఫొటో తీసి పంపించారు. మిగిలిన వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ ఇంటిæ అడ్రసులో నాగబాబు కుటుంబం నివాసం ఉంటడం లేదని ఎన్నికల అధికారులు నిర్ధారించుకుని ఓట్లను తిరస్కరించారు.
ఇవేం పనులు..
నాగబాబును సోషల్ మీడియా ఆట ఆడుకుంటోంది. ఆయన కొడుకు వరుణ్ తేజ్ సినిమా హీరో. కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్. కుమార్తె నిహారిక సినిమాల్లోనే ఉన్నారు. ఇదంతా బహిరంగమే అయినా ఓటు నమోదు కోసం నాగబాబు అడ్డదారులు తొక్కడంపై అందరూ తిట్టి పోస్తున్నారు. సినిమాల్లో బోలెడు నీతులు చెప్పే అన్నదమ్ములు రియల్ లైఫ్లో మాత్రం ఏ మాత్రం పాటించరని రుజువైంది.
– వీకే..