జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీ ఫారాలు ఇచ్చి ప్రతిజ్ఞ పేరుతో షో చేశాడు. అందులో చెప్పినవన్నీ అబద్ధాలే. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదని అందులో రాశారు. ఏపీ అప్పుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నట్లు చెప్పింది. కానీ ఎల్లో గ్యాంగ్‌తో చేరి అప్పులు.. అప్పులంటూ ఊదరగొడుతున్నాడు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సి ఉంది అన్నారు. మీకు అధికారం దక్కకపోతే రాష్ట్రం అధోగతి పాలైనట్టేనా.. మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడే అన్నపూర్ణ ఏపీని నాశనం చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేశారు. అన్నదాతలకు అండగా నిలిచారు. గణాంకాలు తెప్పించుకుని చూస్తే అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కనుక వారికి జవాబుదారీగా ఉంటూ, పారదర్శక పాలన అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది అన్నారు. జగన్ సీఎం అయ్యాకే ఏపీలో ప్రజాస్వామ్యం ఉందనేది వాస్తవం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ప్రత్యేక చెప్పనక్కర్లేదు. రాజ్యాంగాన్ని అవమానించేలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర మర్చిపోతే ఎలా.. వైఎస్సార్సీపీ పాలన అత్యంత పాదర్శకంగా సాగింది. మేనిఫెస్టోను అమలు చేశారు. చంద్రబాబులా కనిపించకుండా చేయలేదు.
తెలుగువారి జీవన రేఖ పోలవరం నిర్మాణం పూర్తి అన్నావు. అసలు పోలవరాన్ని కట్టిస్తానని కేంద్రం తీసుకుని వేల కోట్ల రూపాయలు కాజేసింది చంద్రబాబే కదా. కాంట్రాక్ట్ కంపెనీ నిర్వాహకులే ఈ మాటలు చెప్పారు. సోమవారం పోలవరం పేరుతో ఎలా బిల్డప్ ఇచ్చాడో పూసగుచ్చినట్లు వివరించారు. ఆ మాటలు వినలేదా.. విన్నా కూడా నటిస్తున్నావా.. బాబు మళ్లీ సీఎం అయితే దోచుకుంటాడు తప్ప పూర్తి చేయడు. నీకు వాటా ఇస్తాడు కదా.. సామాజిక న్యాయం, యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని అన్నారు. టికెట్ల కేటాయింపుల్లోనే కూటమి పార్టీల సామాజిక న్యాయం ఏపాటితో బయటపడింది. జగన్ 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాడు. ఇక అప్పట్లో మీ కూటమి ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసింది. జనసేన నుంచి ఒక్క మహిళకే అవకాశం కల్పించి మళ్లీ నువ్వే సముచిత స్థానం అనడం ఏ మాత్రం సముచితంగా లేదు. మహిళలకు రాజకీకంగా అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే. నీ మీద, లోకేశ్ మీద, బాలకృష్ణ మీద పోటీ చేస్తోంది వారే. అసలు అమరావతి జనం మెచ్చే రాజధాని కాదని తమకే 2019 ఎన్నికల సమయంలో కూశారు. మరి దానికోసం ఎందుకంత ఆరాటమని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
అసలు జనసేన ప్రతిజ్ఞ పైకి ఒకలా కనిపించినా.. లోపల మరొకటి చేయించారని జనంలో టాక్ ఉంది. ‘నేను జనసేనలో ఉన్నా తెలుగుదేశం కోసమే పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు, లోకేశ్, దేవాన్ష్ ప్రయోజనాలకే నాకు ముఖ్యం. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల మాటలకు ఎదురు చెప్పను. వారు ప్రజా సొమ్మును దోచుకునేలా అవకాశం కల్పించి అందులో పావలా వంతు భాగం తీసుకుంటాను. కట్టు కథలు చెప్పి ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకొంటాను. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే సహకరిస్తాం తప్ప ఎదురు చెప్పను’ ఇది పవన్ చేయించిన నిజమైన ప్రతిజ్ఞ అని సేన అభిమానులు చెబుతున్నారు.