పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే హీరో. సీన్లలో, పాటల్లో నీతి వాఖ్యాలు వల్లిస్తుంటాడు. నిజ జీవితానికొచ్చే సరికి ఆయన పాత్ర విలన్‌ను తలపిస్తోంది. మూవీలో హీరో నాశనాన్ని విలన్ కోరుకుంటాడు. ఇందుకోసం ప్రత్యర్థులతో చేతులు కలుపుతాడు. నోటికి అడ్డూఅదుపు లేకుండా తిడుతుంటాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో పవన్ ప్రవర్తన క్రూరమైన విలన్‌ను తలపిస్తోంది. మాటలు, చేష్టలు అలాగే ఉన్నాయి. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి సేనాని ఇదే ధోరణితో ఉన్నాడు. శరీరమంతా విషాన్ని నింపుకొన్నాడు.
రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. ప్రజల గురించే ఆలోచించాలి. వారికి మేలు చేసే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడాలి. కానీ పవన్‌కు ఇవేమీ తెలియదు. స్వచ్ఛమైన మనసుతో పేదలకు అండగా ఉన్న జగన్‌ను తిట్టడమే తెలుసు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన తెలుగుదేశం – జనసేన ఉమ్మడి సభలో సేనాని.. జగన్‌పై పరుష పదజాలాన్ని వాడారు. మొదటి నుంచి అనుకున్నట్లే సినిమా స్టైల్ లో డైలాగ్‌లు చెప్పారు. ఆయన మాటలు అభిమానులే అసహ్యించుకునే స్థాయిలో ఉన్నాయి.
జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదన్నారు. ఎంతో అసూయతో కూడిన మాటలివి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన జగన్ కాలక్రమంలో తనను తాను నిరూపించుకున్నారు. 2009లో భారీ మెజార్టీతో ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. అదే సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ ప్రజారాజ్యం అభ్యర్థులను గెలిపించడంలో విఫలమయ్యారు. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు కోసం సోనియా గాంధీనే ఢీకొట్టిన ధైర్యవంతుడు జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడు. సేనాని రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. 2014లో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. పవన్ జనసేనను స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక బీజేపీ, టీడీపీకి మద్దతు ప్రకటించారు. 2019లో జగన్ రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. ఇక పవన్ పోటీ చేసిన రెండు చోట ఓడిపోయారు. కూటమి కట్టినా ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నారు. 120కి పైగా సీట్లలో సేనకు డిపాజిట్లు రాలేదు. మరోవైపు జగన్ తన కష్టార్జితంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చిరంజీవి తమ్ముడనే హోదా, సినీ గ్లామర్ ఉన్న తను కనీసం ఎమ్మెల్యే కాలేకపోయానని కళ్యాణ్‌కు తీవ్ర నిరాశ ఉంది. జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు. ఇది నా శాసనమని చెప్పిన నోటితోనే ఆయనకు శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చింది.
అసలు జగన్, పవన్‌ల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవు. గొడవలు అంతకంటే లేవు. కానీ ఆయన్ను పూర్తి పేరుతో పిలిచేందుకు కూడా సేనాని మనసు అంగీకరించలేదు. నేడు ఏకంగా అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదన్నారంటే ఏ స్థాయిలో విషం నింపుకొని ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరాలుగా సేనాని.. జగన్‌ను అనరాని మాటలు అంటున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తన అభిమానుల చేత అనిపిస్తున్నారు.
జగన్.. ఇప్పటి వరకు నా తాలూకా శాంతినే చూశావు.. ఇప్పుడు యుద్ధం చూస్తావని సినిమా డైలాగ్ కొట్టారు సేనాని. వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. కానీ ఏనాడూ ప్రతిపక్షాల నాశనం కోరుకోలేదు. ఒకవేళ ఆయన అనుకొని ఉంటే ఈపాటికి టీడీపీ, జనసేన ఉనికిలో కూడా ఉండేవి కాదు. ఇంకా జగన్ బతుకు నా తెలుసు అన్నారు. ఆయన 2009కి ముందు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడూ ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా రాలేదని కాంగ్రెస్ నేతలే చాలాసార్లు చెప్పారు. ఎంపీ అయ్యాక జగన్ జీవితం పూర్తిగా ప్రజలకే అంకితమైంది. ప్రతి పేజీ బహిర్గతమే. అదే పవన్ విషయానికొస్తే వీకెండ్లో అలా ఏపీకి వచ్చి వైఎస్సార్సీపీని తిట్టి హైదరాబాద్‌కు వెళ్లిపోయి సినిమాలు చేసుకుంటారు. ఆయన వివాహాలు, హీరోయిన్లతో ఎఫైర్లపై ప్రజల్లో జరిగే ప్రచారానికి అంతే లేదు. ఇద్దరి బతుకుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
సినిమాలతో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా.. హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానంటూ మళ్లీ సింపతీ డ్రామాకు పవన్ తెరతీశాడు. సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు వస్తాయని ఓవైపు ఆయనే చెప్తాడు. మరోవైపు ఇలా బియ్యం కొనడంలేదంటాడు. జనసైనికులను గొర్రెలు చేయడంలో పవన్‌ది అందె వేసిన చెయ్యి. పొత్తులో మొత్తం ఖర్చు చంద్రబాబుదే. ఆయనే హెలికాప్టర్, ప్రత్యేక విమానం సమకూరుస్తున్నారని అందరికీ తెలుసు. కానీ బీద అరుపులు అరిస్తే పిచ్చి అభిమానులు డొనేషన్లు ఇచ్చేస్తారని ఆలోచన. తనకు నటన రాదని చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. మరి స్కిల్ ఉందని చెప్పడం అబద్ధమే కదా..
రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక కావాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలి. నేనున్నానంటూ భరోసా కల్పించాలి. ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలకు పదును పెట్టాలి. అంతే కానీ ప్రత్యర్థిని లేకుండా చేస్తానంటే అది వెర్రితనమే అవుతుంది. నోరు వేసుకుని జగన్‌ను తిట్టేస్తే ఓట్లు పడిపోతాయనుకుంటే పొరపాటే. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. వారు ఓటనే ఆయుధంతో నిన్నే అధఃపాతాళానికి తొక్కేయగలరు పవన్.. ఒకవేళ ఆ పాపం మనకెందుకులే అనుకుంటే.. ప్యాకేజీ ఇస్తున్నాడని నువ్వు గుడ్డిగా నమ్మిన చంద్రబాబే అవసరం తీరాక ఆ పని చేస్తాడు.