జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ప్రారంభించింది మొదలు ఆయన మొట్టమొదట చెప్పిన మాట కులాలను కలిపే రాజకీయం… మతాల ప్రస్తావన లేని రాజకీయం.. ఈ రెండు మాటలను చాలా బలంగా చెప్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం ప్రాకులాడాడు. ఒక రకంగా ఈ మాటల గారడీతోనే యువతను ఆకర్షించి తన వైపు తిప్పుకున్నాడు. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా ప్రదాన అంశాలుగా ఈ రెండిటిని చేర్చాడు. ఎప్పుడూ తన అడుగులు ఆలోచన అందుకు భిన్నంగానే ఉన్నాయి. నిజానికి ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు తూచా తప్పకుండా పాటించాడు గమనిస్తే ముక్కున వేలు వేసుకోక తప్పదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 2024 ఎన్నికల నేపథ్యంలో టిడిపి జనసేన బిజెపి కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించింది కేవలం 21 సీట్లు మాత్రమే… ఆ 21 సీట్లలోనూ 10 -11 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులకు కేటాయించగా, మిగిలిన స్థానాల్లో కాపు లేదా బలిజ కులస్తులకు కేటాయించాడు. కానీ గోదావరి జిల్లాలో కాపులు తర్వాత అత్యంత బలమైన సామాజిక వర్గమైన శెట్టి బలిజ కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కానీ జగన్ తను ప్రకటించిన 175 స్థానాలలో 2 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లని శెట్టి బలిజలకు కేటాయించాడు. కాపుల విషయంలో కూడా కూటమి కంటే జగనే ఎక్కువ సీట్లు కేటాయించాడు. వైసిపి కాపులకు 31 స్థానాలు కేటాయించగా టిడిపి 14 జనసేన 10 కలిపి మొత్తంగా కూటమి 24 స్థానాలు మాత్రమే కేటాయించింది. అలాగే ఎంపీ స్థానాలు విషయంలో కూడా వైసీపీ 5 స్థానాలు కాపులకు కేటాయించగా కూటమి కేవలం మూడు స్థానాలు మాత్రమే కేటాయించింది.
మొన్న జరిగిన రాజమండ్రి సభలో కాపులు కమ్మోళ్లకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికే 2014 లో టీడీపీ కి మద్దతిచ్చాను అని చెప్పిన పవన్ ఒక్క రెడ్డికి కూడా సీట్ కేటాయించిన పరిస్థితి లేదు. నాడు జనసేన తరఫున ప్రకటించబోయే మొట్టమొదటి సీటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణకే అని చెప్పిన పవన్ నేడు జనసేనలో సీటు కోసం కాళ్ళ ముందు నిలబడితే బాలకృష్ణని లేదు పొమ్మన్నాడు. దీనిని కులాలను కలపడం అనరు, కాపులను కమ్మలకు తాకట్టు పెట్టడం, ఫలితంగా ప్యాకేజీ అందుకోవడం అంటారు. జగన్ కమ్మ వ్యతిరేకం అని బాబు మెప్పుకోసం ఊరూరా తిరిగి ప్రచారం చేసి, ఒక్క శెట్టి బలిజకి గాని ఒక రెడ్డికి గాని పవన్ టిక్కెట్ ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు.