ప్రత్యక్ష రాజకీయాల్లో పదేళ్ళు నుంచి ఉన్నా కూడా తాను పోటీ చేయవలసిన నియోజకవర్గాన్ని ఎంచుకోలేని స్థితి లో ఉన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో పొత్తు రాజకీయం అనుకుంటున్నారు కానీ, ఎదుటివాడి శక్తిని సర్వం హరింపచేసే చంద్రబాబు తరహా రాజకీయం అంటే ఏంటో పవన్‌కు తెలియరావట్లేదు. దాని ఫలితమే తన పోటీ భీమవరం నుంచా, పిఠాపురం నుంచా అనే సందిగ్ధంలో పడటం.
తనకున్నది భూగోళమంత అభిమానగణమనీ, తన అభిమానులే తన ధైర్యమనీ, అభిమానుల బీమా డబ్బులు కోసం సొంతంగా మూడు కోట్లు ఇచ్చానని కూడా చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఏదో తేల్చుకోవడానికి మాత్రం కాపుల ఓట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో భీమవరంలోని కాపుల ఓట్లను నమ్ముకుని ఘోర పరాభవానికి గురయిన కళ్యాణ్, ఈ సారి అలా అవ్వకుండా ఉండేందుకు మరిన్ని కాపు ఓట్లు ఉన్న పిఠాపురం వైపు ఆశగా చూస్తున్నారు.
ఒక పార్టీ నాయకుడు, తన ఇమేజి ఎంతో ఉందని నమ్మే సినిమా హీరో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచేంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోవడం మాత్రం జనసేన దురదృష్టం అనే చెప్పాలి. అయితే, ఇదంతా చంద్రబాబు ప్లానని… భీమవరంలో టీడీపీ అభ్యర్థికి ధోనీసేన కండువా కప్పి, పోటీకి దింపనున్నారనీ, అందుకోసమే పవన్ ఆ సీటు త్యాగం చేసి పిఠాపురానికి ఒప్పుకున్నారని మరొక వాదన వినబడుతుంది. మరి టీడీపీకి తనఖా పెట్టిన కాపుల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కాపులు పవన్‌కి ఓటేస్తారో లేదో మాత్రం వేచి చూడాలి.