నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో ఉన్న లిరిక్స్ ఇవి. రాజకీయ నాయకుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఎలా మోసం చేస్తాడో వివరించి అలాంటి ఓ ఫక్తు స్వార్థ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారిపోయారు. 2014 లో పార్టీ పెట్టినప్పుడు పవన్ ఆవేశపూరిత ప్రసంగాలను చూసి రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన మారుతుందని నమ్మిన అభిమానుల ఆశలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబుకు భేషరతుగా మద్దతిచ్చారు. పోటీ చేయకుండా మద్దతివ్వడం ఏంటని అవాక్కవడం అభిమానుల వంతయింది. ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబుకు లొంగిపోయాడన్న విమర్శలు మూటగట్టుకున్నాడు.
ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన పవన్ ప్రతిపక్షాన్ని మాత్రమే ప్రశ్నించి నవ్వుల పాలయ్యాడు. ఐదేళ్లు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కాలం గడిపి 2019కి రూటు మార్చి రాజధానిలో స్కామ్ జరిగిందంటూ బాంబు పేల్చారు. నేను మద్దతు ఇవ్వకుంటే చంద్రబాబు రిటైర్ అయ్యేవారని ఆయనను మళ్ళీ పదవిలో కూర్చోబెట్టింది తానే అంటూనే, చంద్రబాబు రాజు కాదని, లక్షల మంది రైతులతో సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. రెండువేల కోట్ల స్కామ్ జరిగిందని దళితుల భూములను చంద్రబాబు ముఠా కొట్టేశారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా బీజేపీ విధానాలను కూడా తీవ్రంగా విమర్శించారు. కట్ చేస్తే 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాను విమర్శించిన బీజేపీతో ముందే జట్టు కట్టి, చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని అవకాశం ఉన్న ప్రతీ పార్టీ ట్రై చేస్తుంది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మానేసి పొత్తులకోసం పరుగులు పెట్టడం పవన్ కే చెల్లింది. 2019లో వేల కోట్ల స్కామ్ చేశాడంటూ బాబుపై విరుచుకుపడిన పవన్ ఇప్పుడు అదే బాబుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడు. అంటే అప్పుడు ప్యాకేజ్ ఇవ్వనందుకు అలా ఎదురు తిరిగాడా లేక ఆ వేల కోట్ల స్కామ్ లో పవన్ కి కూడా వాటా ఇచ్చి బాబు సైలెంట్ చేశాడనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పవన్ చంద్రబాబుతో విభేదించాడని ఇప్పుడు ఎదిగే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ నిలకడ లేని రాజకీయాలను ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నా అభిమానులు తలెత్తుకోలేక బాధపడుతున్నా పవన్ మాత్రం తనను నమ్ముకున్న నాయకులను, అభిమానులను గంపగుత్తుగా చంద్రబాబుకు తాకట్టు పెట్టడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నా చంద్రబాబుకు లబ్ది చేకూర్చే రాజకీయాలు చేయడం పవన్ కే చెల్లింది.