– ఆర్భాటంగా కోట్ల కొద్దీ విరాళాల ప్రకటన
– తాను ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల నుంచి వసూళ్లు
– ఆనక తానివ్వకుండా ఎగవేత .
– గతంలో అనేక వాటికి డబ్బు ఎగ్గొట్టిన వైనం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు.. చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. ముఖ్యంగా నగదు విషయంలో మాటపై నిలబడరు. నేను విరాళమిస్తున్నా అంటూ ఆర్భాటంగా ప్రకటిస్తారు కానీ.. కాసేపటికే దాని గురించి మర్చిపోతారు. తాజాగా పార్టీ బలోపేతం, ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్ల స్వార్జితాన్ని ఇస్తానని చెప్పారు. ఇందులో ఒక కిటుకు దాగుంది.
పవన్‌కు ధన దాహం ఎక్కువ. మొదటి నుంచి సినిమాల్లో నిర్మాతలను ముక్కుపిండి మరీ రెమ్యునరేషన్ తీసుకునేవారు. మూవీ ఫ్లాప్ అయితే మిగిలిన హీరోలు కొంత నగదు వెనక్కి ఇస్తుంటారు. కానీ పవన్ అలా ఎప్పుడూ చేసిన దాఖలాల్లేవు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత చెప్పుకోదగిన హిట్ లేకపోయినా తన అమౌంట్లో రూపాయి కూడా తగ్గించుకోరని తోటి నటులు చెబుతుంటారు. ఒక్కో చిత్రానికి రూ.50 కోట్ల పైనే తీసుకుంటానని ఆయనే స్వయంగా చెప్పిన సందర్భాలున్నాయి. ఈ సంపాదన సరిపోలేదని కాబోలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పాన్సర్‌షిప్‌తో జనసేన పార్టీని ప్రారంభించారు. అప్పటి నుంచి రెండు చేతులా ఆర్జిస్తున్నారు.
బీద అరుపులు
ఇక రాజకీయాల్లోనే ఉంటా. సినిమాలు చేయనని చెప్పిన పవన్ మాటపై నిలబడలేదు. 2019 నుంచి ఎడాపెడా చిత్రాలు ఒప్పుకొన్నారు. దీనికి ఆయన చెప్పిన కారణం పార్టీని నడపాలంటే డబ్బు కావాలి. నా వద్ద కార్ల ఈఎంఐలు కట్టేందుకు కూడా నగదు లేదు. స్టాఫ్‌కు జీతాలు ఇవ్వలేకున్నా అని మొసలికన్నీరు కార్చారు. వకీల్‌సాబ్, భీమ్లానాయక్, బ్రో తదితర మూవీస్ చేశారు. ఇంకా ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ తదితర చిత్రాలు చేస్తున్నారు. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. పవన్ చెప్పిన లెక్క ప్రకారం కనీసం వీటి ద్వారా ఆయన రూ.250 కోట్ల పైనే సంపాదించి ఉంటారు. కానీ నా దగ్గర డబ్బుల్లేవంటూ ఎప్పుడూ బీద అరుపులు అరుస్తుంటారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. కళ్యాణ్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి నితిన్‌తో చిత్రం నిర్మించారు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. తన డబ్బును స్నేహితులకు ఇచ్చి సినిమాలు తీయిస్తుంటారని విమర్శ కూడా ఉంది.
రాజకీయాల్లో పవన్ సంపాదన చాలా ఎక్కువ. 14లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ రూపంలో ఆస్తులు బాగా కూడగట్టారని పేరు తెచ్చుకున్నారు. గిఫ్ట్‌గా లింగమనేని నుంచి భూములను తక్కువ ధరకు పొందారు. అసలు జనసేన ఖర్చులు భరిస్తోంది బాబేనన్న ప్రచారం ఉంది. పవన్ తిరిగేందుకు హెలికాప్టర్లు, స్పెషల్ ఫైట్లు పంపేది టీడీపీనే అని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగా చెబుతుంటారు. ఈ లెక్కన సినిమాల్లో సంపాదించిన డబ్బంతా మిగిలిపోతున్నట్లే కదా.. ఇక పార్టీ కోసమైతే సంవత్సరమంతా ఏదో ఒక కారణం చెప్పి విరాళాలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే 24లో మా కూటమి అధికారంలోకి రాగానే మీకు లబ్ధి చేకూరుస్తామని ప్రస్తుతం సేనాని నిర్మాతల నుంచి పార్టీ ఫండ్ వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇక తన సినిమాలు రీ రిలీజ్ చేయించి దండుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో ఆయన జేబులో నుంచి ఒక్క రూపాయిని పార్టీ కోసం ఖర్చు పెట్టే అవకాశం లేదు. నియోజవకర్గాలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే వెర్రి అభిమానులు, తెలుగుదేశం అధిష్టాన పెద్దలు ఆయన ఖర్చులను భరిస్తున్నారు.
సినిమాలు, రాజకీయాల్లో బాగా సంపాదించిన పవన్‌కు గాలి మాటలు చెప్పడం బాగా అలవాటు. నేను విరాళమిస్తున్నానంటూ పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో ఆర్భాటంగా ప్రకటిస్తారు. కానీ చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. గతంలో కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడుతున్నానని, రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. అది అతీగదీ లేదు. ఇక 2019 ఎన్నికల ప్రచారం సమయంలో భీమవరం వెళ్లినప్పుడు వంద అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయిస్తా.. అందుకు రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నా అన్నారు. ఆ విషయం ఏమైందో తెలియదు. వెంకటరాహుల్ అనే క్రీడాకారుడికి రూ.10 లక్షల సాయం ఇచ్చేస్తానన్నాడు. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య స్మారక భవనం కోసం రూ.కోటి ఇస్తున్నట్లు ఘనంగా చెప్పుకొన్నారు. జనంలో పేరు కోసం పవన్ పేరుకు విరాళం ఇస్తానంటారు గానీ ఎక్కడా ఇచ్చినా దాఖలాల్లేవు.
అసలు విరాళాల ప్రకటన వెనుక ఒక కిటుకు దాగుంది. తాను ఇస్తున్నట్లు చెప్పి అభిమానుల నుంచి కూడా విరాళాల రూపంలో నగదు వసూలు చేయడమే అది. అల్లూరు విగ్రహం, సంజీవయ్య స్మారక భవన కోసం రూ.కోటి లెక్కన ఇస్తానని చెప్పి.. మీరు స్పందించండి అంటూ తన అభిమానులు, కార్యకర్తలను సోషల్ మీడియాలో కోరారు. వాళ్లు భారీగా డబ్బు ఇచ్చారు. అదంతా ఎవరి జేబులోకి వెళ్లిందో అంతుచిక్కని రహస్యం. కానీ విగ్రహం పెట్టలేదు. స్మారక భవనం కట్టించలేదు.
ప్రస్తుతం జనసేన ఎన్నికల ఖర్చంతా చంద్రబాబే చూసుకుంటున్నారు. జిల్లాలకు తిరగాలని ప్రత్యేక విమానం ఇచ్చారు. సోమవారం అందులోనే పవన్ విశాఖకు చేరుకుని సమావేశాలు నిర్వహించారు. పార్టీ కోసం రూ.10 కోట్ల స్వార్జితాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించి డప్పు కొట్టుకుంటున్నారు. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే విరాళం ఇవ్వడం ఏంటనే అనుమానం ఎవరికైనా రాక మానదు. కానీ నేను ఇస్తున్నా కదా.. మీరు కూడా డబ్బు పంపాలని కార్యకర్తలను కోరడమే ఇందులోని కిటుకు. ఓవైపు ఖర్చులన్నీ టీడీపీ చూసుకుంటుంటే ఇక డబ్బుతో పనేముందని వాదించే వారు ఉన్నారు. కాకపోతే అభిమానుల నుంచి వసూలు చేసే వ్యూహమిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేను సినిమా చేస్తే వందల కోట్లు వస్తాయి. నాకు ఎవరికీ ఇవ్వనంత రెమ్యూనరేషన్ ఇస్తారని చెప్పుకొనే పవన్‌ను కేవలం రూ.10 కోట్లు ఇవ్వడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తే ఇదంతా చాలా సింపుల్‌గా ఇదంతా వైఎస్సార్సీపీ కుట్ర అంటాడు. చంద్రబాబు వల్ల రాజకీయాల్లో బాగా రిచ్ అయిన సేనాని విరాళాల పేరుతో చేసే దందాకు ఎప్పుడు చెక్ పడుతుందో..