ఈనెల 13వ తారీకున జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతటి ఉత్కంఠని రేపాయో చూసాం. రేపు జూన్ నాలుగో తారీఖున వెలువడే 2024 సార్వత్రిక ఎన్నికలఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యర్థి, ప్రతిపక్ష పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరింత బలంగా పనిచేస్తుంది. కారణం పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, మరొకపక్క కాకినాడ రూరల్ నుంచి జనసేన కాండిడేట్ బరిలో నిలవడం.
అయితే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పంతం నానాజీకి టిక్కెట్ కేటాయించక ముందు నుంచే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు పై దుష్ప్రచారానికి తెర తీశారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ కన్ఫామ్ కాకముందే రూరల్ వైసీపీ ఓడిపోతుంది అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. జనసేన అభ్యర్థి మెజారిటీ 30 వేల పైచిలుకు ఉంటుందంటూ ఊదరగొట్టారు. తద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శతవిధాల ప్రయత్నించారు. అయితే కేవలం కాపు సామాజిక వర్గపు ఓట్లు మాత్రమే కొలమానంగా ఎన్నికల బరిలో దిగిన జనసేన గెలుపు మాదే అంటూ చేసిన హడావుడి ఎన్నో రోజులు నిలవలేదు.
ఎన్నికల అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మరి 20,000 మెజారిటీతో గెలవబోతున్నాను అంటూ ప్రజలకు అభివాదాలు తెలియజేసిన పంతం నానాజీ ధైర్యం, ఎన్నికల ఫలితాలు దగ్గరకు వస్తున్న వేళ సన్నగిల్లిపోయింది. అసలు ఏమాత్రం గెలుపుకు దగ్గరలో కూడా ఉండమనే విషయం తేటతెల్లమయ్యేసరికి కాకినాడ రూరల్ జనసేన పార్టీ డైలమాలో పడింది. దీంతో ఓటమిని ఎలా అయినా సమర్థించుకోవడం కోసం ఓట్ల లెక్కింపులో అవకతవకలకు వైసిపి పాల్పడుతుంది అనే సమాచారం ఉంది అంటూ మరో తప్పుడు ప్రచారానికి తెర లేపింది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో జనసేన కౌంటింగ్ ఏజెంట్లను కొనే ప్రయత్నంలో వైసీపీ పని చేస్తుంది అంటూ మసిపూసి మారేడుకాయ చేయటానికి మరో తప్పుడు ప్రచారానికి పూనుకుంది. అయితే ఓటమి భయంతోనే జనసేన పార్టీ అభ్యర్థి ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ గొడవలకు దారి తీసేలా కార్యకర్తలని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు స్థానిక ప్రజలు.