కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మొదటిసారిగా అవయవదానం జరిగింది. వివరాల్లోకి వెళితే కర్నూలు నగరానికి చెందిన గజ్జల పావని లత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఫిబ్రవరి 5న చికిత్స పొందుతున్న పావని లత బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు.
దీంతో జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి అవసరం మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిష్టాతులైన డాక్టర్ల సహాయంతో , ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని గజ్జల పావని లత ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి కి , కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి తరలించారు. అదేవిధంగా రెండు మూత్రపిండాలను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఒకటి , కర్నూలు లోని కిమ్స్ ఆసుపత్రికి ఒకటి అందించగా, కళ్ళను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి అందించారు.
పావనిలత కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చినందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వారిని అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవయవదానం వల్ల బాధితులను ఆదుకోవడంతో పాటు చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు భావించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బందిని , రెడ్ క్రాస్ సిబ్బంది, పోలీసులను జిల్లా కలెక్టర్ అభినందించారు.