విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం అంచనాల మేరకు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి సోమవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించి, జరుగుతున్న పనుల అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తునట్టు, అనుకున్న విధంగానే ఇప్పటికి 25% పని పూర్తయిందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు జవహర్‌రెడ్డికి నివేదించారు. అలాగే ఆగస్టు 2026లో మొదటి వాణిజ్య విమానాన్ని ల్యాండ్ చేయించాలనే లక్ష్యంతో ఉన్నామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
“టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, రన్‌వే మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌తో సహా విమానాశ్రయంలోని అన్ని అంశాలకు సంబంధించిన నిర్మాణాలు ఏకకాలంలో జరుగుతున్నాయి” అని సైట్ ఇంజనీర్ తెలిపారు. భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 2023 మేలో శంఖుస్థాపన చేశారు. దశలవారీగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఫేజ్ 1లో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణీకులను అలాగే వరుసగా 2,3 దశల్లో 12 మిలియన్లు, 18 మిలియన్లకు విస్తరించబడుతుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ 4,592 కోట్లతో చెపట్టారు. స్థానికలు, వైసీపీ నాయకులు గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందనే ఆశభావంతో ఉన్నారు. పెట్టుబడిని ఆకర్షించడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలకం కానుందనేది కాదనలేని సత్యం. విశాఖపట్నం, భోగాపురం మధ్య ఉన్న 40 కిమీ మార్గం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతోంది, రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పెట్టుబడిదారులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోనే ఒక జెయింట్ వీల్, స్కై టవర్, టన్నెల్ అక్వేరియం ఇంకా కొత్త ఒబెరాయ్ సెవెన్-స్టార్ హోటల్ వంటి ప్రాజెక్టులతో విశాఖ పర్యాటక కేంద్రంగా కూడా మారనుంది.