మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..
ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.23,469 కోట్ల రూపాయిలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డిబిటి ద్వారా ఈ ఐదేళ్లలో రూ.13,389 కోట్లు ఇవ్వగలిగాము. నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 5,963 కోట్లు అందించగలిగాం. ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 ఎస్టీ కుటుంబాలకు మంచి జరిగింది. ఎస్సీలకు ఇప్పుడే మూడు కార్పొరేషన్లు పెట్టడం జరిగింది.
అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయితీగా వర్గీకరిస్తూ 165 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాలు, అక్కడ అన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం జరిగింది. దీన్ని కొత్తగా చేయబోతున్నాం.
క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలకు… హిందూ దేవాలయాలకు జరుగుతున్నవి కూడా కొనసాగుతూ ఉంటాయి.కొత్తగా తీసుకు వస్తున్న విషయం ఏమిటంటే హిందూ దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి. అన్ని ప్రార్థనాలయాలకు ఇది తీసుకొస్తున్నాం.
ఇప్పటికే డిబిటి ద్వారా రూ.1,28,000 కోట్లు నాన్ డిబిటి ద్వారా మరో రూ.53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో చెప్తున్నాను. నాయి బ్రాహ్మణులకు ఇచ్చే దాని గురించి కూడా వెబ్సైట్లో వివరంగా పెట్టాము. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేసామో అనేది కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాం. కాపు సంక్షేమం కోసం కూడా ఐదేళ్లలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఓసీలికు ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరాలను కూడా వెబ్సైట్లో వివరంగా పొందుపరిచాం.
కులవత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి చిన్న మార్పు చేయబోతున్నాం. జననన్న తోడు ద్వారా 16 లక్షల మందికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి, ఫుట్ పాత్ ల మీద, తోపుడు బండ్ల మీద అమ్ముకుంటున్న వారు, ఇలాంటివారు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే రుణాల అందించే కార్యక్రమం. దాదాపుగా రూ. 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీని ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి రుణాల అందించే కార్యక్రమం చేస్తున్నాం. రుణాలను సవ్యంగా తిరిగి కట్టడాన్ని ప్రోత్సహిస్తూ, సవ్యంగా కట్టిన వారికి మరో సంవత్సరం రుణాన్ని పెంచుతూ రూ.13,000 దాకా రుణం ఇచ్చేలా తీసుకుపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం రూ.15 వేలకు పెంచి, రూ.20,000 దాకా తీసుకెళుతున్నాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్.
లక్షల మందికి పెట్టుబడి సహాయం కింద రూ. 10,000 మాత్రమే ఉండేది ఇప్పుడు రూ.15,000 అయింది. సకాలంలో చెల్లించిన వారికి ప్రతి ఏడాది రూ.1,000 చొప్పున పెంచుకుంటూ రూ. 20,000 ఇప్పించే కార్యక్రమం చేస్తాం. జగనన్న చేదోడు ఈ పథకం కింద షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి రూ.1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ పథకం ఇలాగే కొనసాగుతుంది.
వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఈ ఏడాది నుండీ విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పదిలక్షల వరకు పూర్తి వడ్డీని కోర్స్ పూర్తయ్యే వరకు, లేదా గరిష్టంగా ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుంది.
25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నవారు… అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలు వీళ్ళకి కూడా లభిస్తాయి.బిపిఎల్ కుటుంబాలకు సంబంధించి గతంలో అప్పర్ సీలింగ్ అనేది రూ.6,000, రూ.5,000 గా ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గ్రామాల్లో రూ.10,000, రూ.12,000 కు పెంచాము.
ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది బటన్ నొక్కితే తెలిసే విధంగా డేటా తో సహా పారదర్శకంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే వారి కుటుంబాల ఖాతాలకు వెళ్ళేలాగా చేస్తున్నాం. స్విగ్గి, జొమాటో అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్ కు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఐదు లక్షల జీవన బీమా కల్పించే కార్యక్రమం తీసుకువస్తున్నాం. వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకొస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.