నారాయణ విద్యాసంస్థల్లో మరో ప్రాణం పోయింది. తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లాడు ఉరేసుకుని అనంతలోకాల్లో కలిసిపోయాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాధిత తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. నారాయణకు చెందిన పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు గతంలో చాలా సందర్భాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. విద్యాసంస్థల ఒత్తిడి తట్టుకోలేక.. వేధింపులు తాళలేక క్యాంపస్ హాస్టళ్లలోనే తనువు చాలించిన వారెందరో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఆత్మహత్యలను అడ్డుకునేలా దాని యాజమాన్యం ఏనాడూ పూనుకోలేదు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు అర్థాంతరంగా కన్నుమూస్తున్నారు.
తాజాగా..
విశాఖలోని నారాయణ పాఠశాలలో శ్రీకాకుళానికి చెందిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగి నెల్లూరు రవికుమార్ కొడుకు అఖిల్ వినాయక్ (13) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా బాధిత తండ్రి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కొడుకు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అనారోగ్యానికి గురైన అఖిల్‌ను ఒంటిరిగా గదిలో వదిలేశారని బాధపడ్డారు. ఉరేసుకున్న విషయం తెలిసినా కిందకు దించి ఆస్పత్రికి తరలించకుండా చాలాసేపు అలాగే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఆస్పత్రి ఉన్నా మరోచోటుకు తీసుకెళ్లారన్నారు. అఖిల్ మృతిపై అనుమానాలున్నాయని పోలీసులు విచారించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఎన్నో ఘటనలు ఆ విద్యాసంస్థల్లో జరిగాయి.
చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తి
ఈ విద్యాసంస్థల యజమాని పొంగూరు నారాయణ. తెలుగుదేశం పార్టీ నాయకుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. అమరావతి భూ కుంభకోణంలో కీలక వ్యక్తి. ఈయన గంలొ నెల్లూరులో విద్యాసంస్థలను ప్రారంభించి దేశం నలుమూలలకు విస్తరించారు. మెడికల్, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ కాలేజీలున్నాయి. పాఠశాలలైతే లెక్కలేనన్ని నెలకొల్పాడు. ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించరు. ఇష్టానుసారంగా సంస్థల్ని నడుపుతారు. చదువును అమ్మడంలో దిట్ట. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ ఎదుగుదల వేగంగా జరిగింది. అందుకే బాబు పట్ల ఆయన విపరీతమైన భక్తి చూపిస్తుంటారు. ఆ విద్యాసంస్థల్లో ఏమి జరిగినా బాబు అండ్ కోకు పట్టదు. తీవ్రమైన ఒత్తిళ్లు లేదా వేధింపుల కారణంగా పిల్లలు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్నా మాజీ మంత్రి ఏనాడూ స్పందించలేదు. ఒక్కరిని కూడా పరామర్శించిన దాఖలాల్లేవు. పైగా తన పలుకుబడిని ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించడమో.. లేకుండా చేయడమో చేసేవారు. ఈ ప్రభుత్వంలో పొరపాటున ఎక్కడైనా బడిలో చిన్న సంఘటన జరిగితే సీఎం జగన్‌పై నోరు పారేసుకునే నారా వారు, ఆయన తనయుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఆయా పార్టీల నేతలు నారాయణ విద్యాసంస్థల విషయంలో మాత్రం కళ్లున్నా గుడ్డి వారిలా నటిస్తారు. తాజాగా జరిగిన విషయంపై కూడా వారి నుంచి ఎటువంటి స్పందన ఉండదు. ఎందుకంటే తమకు బాగా కావాల్సిన నారాయణ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కదా..