నరసాపురం పార్లమెంట్ స్థానానికి బీసీ మహిళను సమన్వయకర్తగా నియమించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. దీని పరిధిలో ఆచంట, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికలు చూస్తే ఏడు సార్లు కాంగ్రెస్ గెలిచింది. నాలుగు సార్లు తెలుగుదేశం గెలిచింది. 1996 తర్వాత ఈ పార్టీ గెలవలేదు. 2019లో రఘురామకృష్ణంరాజుకు జగన్ సీటు ఇచ్చి గెలిపించారు. అయితే ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ స్థానంలో సమన్వయకర్తగా గూడూరి ఉమాబాలను జగన్ నియమించారు. దీంతో పార్లమెంట్ పరిధిలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆమె కలుస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ సీటును బీసీ మహిళకు కేటాయించి సీఎం జగన్ చరిత్రను తిరగరాశారని చెప్పారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది జగన్ మాత్రమే అన్నారు. ప్రజలందరి సహకారంతో నరసాపురంలో గెలిచి సీఎంకు కానుకగా ఇస్తామని వెల్లడించారు.