వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా ఉంది. ఆసక్తిగల వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి సబ్సిడీపై యంత్రాలు సమకూరుస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయం చేయడం ద్వారా అన్నదాతలకు లాభాలు వస్తాయని భావించి ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా పంటల సాగులో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు. ఆర్బీకే స్థాయిలోనే అవి అందుబాటులో ఉంటే బాగుంటుందని సీఎం ఆలోచన.
దీనికి అనుగుణంగా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకారం ఒకడుగు ముందుకు వేసింది. 20 డ్రోన్లతో హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటి కొనుగోలుకు రూ.1.94 కోట్లు అవుతుంది. సంఘం 10 శాతం పెట్టుకోగా మిగిలిన మొత్తాన్ని డీసీసీబీ రుణంగా ఇచ్చింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో రైతులకు డ్రోన్లను అద్దెకు ఇచ్చేందుకు సహకార సంఘం ముందుకు రావడం ఇదే ప్రథమం. డ్రోన్లు త్వరలో రానున్నాయి. వాటి నిర్వహణ వ్యామిక్ ఇన్నోవేషన్‌కు అప్పగించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే ఎన్నో ఉపయోగాలున్నాయి. ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.