ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఆయన ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా ఈ సమయంలో ఆయన గౌరవం లేని చోట ఉండలేనని పార్టీపై అభాండం చేశారు. కానీ ఆ వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు• విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. నేతలు ఎన్నికల సమయాల్లో రకరకాల కారణాలతో పార్టీ మారుతుంటారని చెప్పారు. వైఎస్సార్సీపీలో ఆత్మగౌరవ సమస్య ఎప్పటికీ తలెత్తదని స్పష్టం చేశారు. మాగుంట వ్యాఖ్యలు సరైనవి కాదని, తమ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఎనలేని గౌరవమర్యాదలు ఉంటాయన్నారు. పార్టీలు మారే వారికి ఎవరి కారణాలు వారికి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
మాగుంట శ్రీనివాసులురెడ్డి సీనియర్ నాయకుడు. ఆ గౌరవంతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ఆయనకు ఒంగోలు ఎంపీగా అవకాశమిచ్చి గెలిపించారు. పార్టీలో చాలా గౌరవం దక్కింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఆయన్ను కార్యక్రమాలకు పిలిచి పెద్దపీట వేశారు. కానీ నేడు గౌరవం దక్కలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయన పార్టీని వీడడం వెనుక చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలున్నాయి. ఏకంగా మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఇక ఈ కుంభకోణంలో మాగుంట, ఆయన తనయుడు రాఘవరెడ్డి కీలకంగా ఉన్నారు. వీరిద్దరూ అప్రూవర్లుగా కూడా మారారు. రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. తర్వాత బెయిల్ లభించింది.
జగన్ ఇలాంటి వ్యవహారాలను ఎప్పుడూ సహించరు. అవినీతిని ప్రోత్సహించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న మాగుంటకు ఈసారి ఎంపీ టికెట్‌ను నిరాకరించారు. దీంతో అలిగిన ఆయన రాజీనామా చేశారు. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట అవినీతిపరుడని, లిక్కర్ స్కామ్‌లో పాత్ర ఎంతో ఉందని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. జగన్‌కు లింకు పెట్టి అబద్ధపు వార్తలను వండి వార్చింది. ఇప్పుడు రాజీనామా చేయగానే ఆయనంత మంచివాడని లేడని ఆకాశానికి ఎత్తేస్తోంది. జగన్‌కు గట్టి షాక్ తగిలిందని సంబరపడుతోంది. నా పార్టీలోకి అవినీతిపరులు, హంతకులు ఇలా ఎవరు వచ్చినా చాలు తీసుకుంటా అనే స్థితికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయారు. దీంతో ఆయన మాగుంటకు గాలం వేశారు. కొడుక్కి సీటు ఇస్తామని హామీ దక్కడంతోనే రాజీనామా చేశారు. టికెట్ కావాలంటే జగన్‌పై అభాండాలు వేయాలని బాబు కండీషన్ పెట్టడంతో మాగుంట ప్రెస్మీట్లో ఇష్టమొచ్చింది మాట్లాడారు. వాస్తవానికి గౌరవం దక్కక ఆయన వెళ్లడం లేదు. తప్పు చేసి.. తలెత్తుకోలేక పోతున్నాడు. రేపు టీడీపీలో చేరగానే శ్రీనివాసులురెడ్డి ఎల్లో గ్యాంగ్‌కు కడిగిన ముత్యంలా కనిపిస్తారు.