రైతులకు రుణమాఫీ విషయంలో అబద్దం చెప్పలేక 2014 శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యానని సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం జగన్ 2014 శాసనసభ ఎన్నికల్లో జరిగిన విషయాలను గుర్తుచేస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. సీఎం జగన్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. అందులో రైతు రుణమాఫీ కూడా ఒకటి. దీంతో తమ పార్టీ నేతలు, కొంతమంది శ్రేయోభిలాషులు వైసీపీ కూడా రుణమాఫీ చేస్తుందనే హామీ ఇవ్వాలని సలహా ఇచ్చారు. చేయలేనిది చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని రుణమాఫీ హామీని ఇవ్వలేదు. ఆ ఒక్క అబద్దం ఆడని కారణంగా ఒక్కశాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని సీఎం జగన్ గుర్తుచేశారు.
జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టచ్ చేయలేవని సీఎం జగన్ తేల్చిచెప్పారు. పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్, సబ్బిడీ బియ్యం, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాలను టచ్ చేసే ధైర్యం ఏ ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చుచేస్తేనే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటున్నారని, అలాంటప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం రూ.1.26 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడని సీఎం జగన్ ప్రశ్నించారు.