రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సామాజిక సమతుల్యం పాటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ ఎంపికలో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి ఈసారి బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని తీసుకొన్న నిర్ణయం ప్రస్తుత ఎంపీ లావు కృష్ణ దేవరాయల అలకకి కారణం అయ్యింది. అయితే ఇందుకు ప్రత్యామ్నయంగా లావుకి గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయిస్తామని చెప్పినా తనకి నరసరావుపేటే కావాలని మొండి పట్టు పట్టిన లావు నాటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ కొద్దికాలం క్రితం రాజీనామా ప్రకటించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
వైసీపీ అధిష్టానం మాత్రం తమ నిర్ణయంలో భాగంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్ అనిల్ కుమార్ ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దరిమిలా ఆయన పేటలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవటంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు . పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలను సమన్వయపరుచుకొంటూ అన్నీ వర్గాలను కలుపుకొంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు అనిల్ కుమార్.
మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన లావు టీడీపీలో చేరకపోయినా ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ తన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులతో ప్రతి రోజూ విభాగాల వారీగా భేటీ అవుతూ సామాజిక వర్గ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు త్వరలో పల్నాడులో టీడీపీ నిర్వహించే బహిరంగ సభలో బాబు సమక్షంలో తాను టీడీపీలో చేరతానని ఇన్నాళ్ళూ తనని ఆదరించిన ప్రజలు మరోసారి ఆదరించాలని కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు. అయితే తనకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించిన వైసిపిని ఎందుకు వీడుతున్నాడో, ప్రజలకి, ప్రాంతానికి వైసీపీ న్యాయం చేయలేదనో చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి తానే చేసినవిగా చెప్పుకొంటూ తనని ఆదరించమని కోరడం ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన బాబు ఆయన ఫొటో పెట్టుకొని ఓట్లు అడగడంలా ఉందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించటం విశేషం.