తరచూ టీవీ డిబేట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కొలికపూడి శ్రీనివాసరావు నేడు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా తనను హత్య చేసేందుకు బహిరంగంగా ఓ టీవీ ఛానెల్ సాయంతో సుపారీ ఇచ్చారని ఏపీ సీఐడీ కి రామ్ గోపాల్ వర్మ పిర్యాదు చేసారు. దాంతో అప్పటినుండి కొలికిపూడి పరారీలో ఉన్నారు.
తాజాగా కొలికిపూడి ఇంటికి వెళ్లి ఈరోజు సీఐడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారీలో ఉండటం గమనార్హం. దాంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈరోజు తప్పనిసరిగా సీఐడీ అధికారుల ఎదుట కొలికపూడి హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు తీవ్రత దృష్ట్యా కొలికిపూడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఊహిస్తున్నారు
కొలికపూడికి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. టీడీపీ పార్టీని భుజాలపై మోస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం వలన ఆ పార్టీకి లబ్ది కలిగించే విధంగా కొన్ని ఎల్లో చానెళ్లు కొలికపూడిని వివిధ డిబేట్లలో కూర్చోబెట్టి లబ్దిపొందుతున్నాయి.ఆయన వివాదాస్పద చేతలతో కూడా కొలికపూడి వార్తల్లో నిలవడం గమనార్హం. గతంలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ పై చెప్పుతో దాడికి దిగి సంచలనానికి తెరతీశారు కొలికపూడి. సదరు డిబేట్ నిర్వహించిన హోస్ట్ నా డిబేట్లలో కొలికపూడిని శాశ్వతంగా బహిష్కరిస్తున్నానంటూ పెద్ద డ్రామాకి తెరతీసి తాజాగా ప్రజలు ఆ విషయాన్ని మరచిపోయి ఉంటారని తన డిబేట్లకు ఆహ్వానిస్తూ ఉండటం కొసమెరుపుగా చెప్పొచ్చు.