దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. సెక్షన్ 17 ఏ చట్టం వర్తింపు భవితపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు న్యాయ వ్యవస్థలో ఒక బెంచ్ మార్క్ కానున్న నేపథ్యంలో దేశంలో యావత్తు ఈ తీర్పు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్ ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ అనుమతి లేకుండా ఏపీ సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన. కానీ చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదనేది ప్రభుత్వం తరఫున సీఐడీ చేస్తున్న వాదన.
ఇప్పటికే క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా సుప్రీంకోర్టు నేడు ఇవ్వనున్న తీర్పు భవిష్యత్తులో ఇవ్వబోయే అనేక తీర్పులకు మార్గదర్శిగా దేశ రాజకీయాలను మలుపు తిప్పే తీర్పుగా నిలువనుంది. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది..