‘ఓ నాయకుడు నా జేబులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా ఫోన్ నంబర్లు ఉన్నాయంటాడు. వాడి అంతుచూస్తా.. వీడి అంతుచూస్తానని బెదిరిస్తుంటాడు. అంతటి పరపతి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించవచ్చు కదా..’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి.
లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. సీబీఐలోనూ పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను అప్పటి కేంద్ర పెద్దలు చెప్పినట్లు చేశారు. దీంతో ఈయన్ను ఎల్లో మీడియా హీరోని చేసింది. నారాయణ 2018లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత జనసేన పార్టీలో చేరారు. వీలు చిక్కినప్పుడల్లా పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. 19లో విశాఖపట్నం ఎంపీగా సేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడప్పుడూ ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ మీడియాలో ఫోకస్ అవుతుంటారు.
పవన్‌తో పొసగకపోవడంతో జనసేన నుంచి బయటికి వచ్చేశారు. దీనికి ఆయన చెప్పిన కారణం పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండకుండా సినిమాలు చేయడమే. లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే కొన్నాళ్లు జిల్లాలు తిరిగారు. కొంతకాలం క్రితం జై భారత్ పార్టీ పెట్టారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పాత యజమాని పవన్‌పై పరోక్షంగా మాట్లాడారు.
అసలే పవన్ కళ్యాణ్ అహంకారి. గతంలో ఏదో సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకు నాకు ప్రధాని తెలుసు. అమిత్‌షా తెలుసు. జేపీ నడ్డా తెలుసు. వాళ్ల ఫోన్‌నంబర్లు ఉన్నాయని కార్యకర్తల వద్ద బిల్డప్ ఇచ్చారు. లక్ష్మీనారాయణ ఆ మాటల్ని ఉటంకిస్తూ అంతమంది ఫోన్ నంబర్లుంటే హోదా గురించి అడగొచ్చు కదా అన్నారు. చంద్రబాబును కూడా పరోక్షంగా అన్నారు. రాష్ట్రాన్ని పాలించిన ఓ నేత హోదా ఏమైనా సంజీవినా అని ప్రశ్నించారని, ఆయనే ఏపీ అభివృద్ధిని ఆదిలోనే తుంచేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అంధకారం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వస్తే హోదా ఫైలుపైనే సంతకం పెడతామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
అసలు హోదా విషయంలో పవన్, చంద్రబాబు అనుసరించిన వైఖరిపై లక్ష్మీనారాయణ నేరుగానే వారిని తిట్టొచ్చు. పరోక్షంగా అనాల్సిన అవసరం లేదు. ఆనాడు బాబే హోదా ఏమైనా సంజీవనా.. నా కంటే మీకు ఎక్కువ తెలుసా.. ప్యాకేజీ చాలా బెటర్ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హోదా కోసం పోరాడుతుంటే ఎగతాళి చేశారు. తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యే సరికి నారా వారు ప్లేట్ ఫిరాయించారు. హోదా జపం చేశారు. ఇక పవన్ అయితే బీజేపీ చంకనెక్కి తిరిగి హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, జగన్ ఫెయిలయ్యారని విచిత్రంగా వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని మాత్రం అడగలేదు. పోరాడుతున్న వారిని మాత్రం తిట్టారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రధాని నన్ను బాగా కలవరిస్తుంటాడు అని చెప్పే పవన్‌ను హోదా గురించి అడగొచ్చు కదా అంటే అది అధికార పార్టీ పని అని తప్పించుకొంటుంటాడు. లక్ష్మీనారాయణ ప్రశ్నించడం వరకూ బాగానే ఉంది. కాకపోతే వాళ్లిద్దరి పేర్లు చెప్పి ఉంటే ఈయనకు చిత్తశుద్ధి ఉందని అర్థమయ్యేది. కానీ కర్ర విరగకూడదు. పాము చావకూడదు అన్న చందాన మాట్లాడారు. కొంపదీసి మీ పార్టీకి స్పాన్సర్ బాబేనా.. అందుకే పేర్లు చెప్పలేదా ఏంటీ.. మాజీ సీబీఐ సారూ..